Published : 03 May 2022 01:54 IST

offbeat: వరుడి ప్రొఫైల్‌ పంపితే.. ఉద్యోగం ఆఫర్‌ చేసింది..! వైరల్‌గా మారిన తండ్రీకూతుళ్ల చాట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈడొచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ప్రతి తండ్రీ కలగంటాడు. కాబోయే వాడు తనకంటే బాగా చూసుకోవాలని కోరుకుంటాడు. ఓ తండ్రి అలానే మ్యాట్రిమొనీ సైట్లన్నీ వెతికి ఓ వరుడి ప్రొఫైల్‌ను కూతురికి పంపాడు. తండ్రి పంపిన ప్రొఫైల్‌ చూసిన ఆ కూతురు.. పెళ్లికి ఓకే చెబుతుందనుకుంటే తీరా అతడికి జాబ్ ఆఫర్‌ చేసింది. కూతురి చేసిన ఈ కొంటె పనిపై ఆమెను ప్రశ్నించడంతో పాటు అమె ప్రొఫైల్‌ను కూడా తొలగించాడు ఆ తండ్రి. ఇందుకు సంబంధించిన తండ్రీకూతుళ్ల చాట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

బెంగళూరులోని ఓ స్టార్టప్‌ను నడుపుతున్న ఉదితా పటేల్‌కు ఆమె తండ్రి ఇటీవలే ఓ మ్యాచ్‌ పంపించాడు. అయితే, ఆ వ్యక్తి ప్రొఫైల్‌ను మెచ్చి ఆమె అతడికి జాబ్‌ ఆఫర్‌ చేసింది. విషయం తెలుసుకున్న తండ్రి ‘నువ్వేం చేశావో తెలుసా? పెళ్లి కోసం ప్రొఫైల్‌ పంపిస్తే రెజ్యూమ్‌ అడిగి ఇంటర్వ్యూ లింక్‌ పంపిస్తావా? వరుడి తండ్రికి నేనేం చెప్పును?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. దీనికి ఆమె సింపుల్‌గా నవ్వుతూ ‘ఏడేళ్ల ఫిన్‌టెక్‌ అనుభవమంటే మామూలు విషయం కాదు.. అందుకే ఉద్యోగంలో నియమించుకుంటున్నా. సారీ’’ అని సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించి తండ్రితో చేసిన చాట్‌ను ఆమె స్వయంగా ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

ఇంతకీ ఆ తర్వాత ఏమైందనేగా..? దానికీ ఉదితా పాల్‌ సమాధానం చెప్పిందండోయ్‌. ప్రొఫైల్‌ నచ్చి జాబ్‌ ఆఫర్‌ చేస్తే అతగాడు ఏకంగా సంవత్సరానికి రూ.62 లక్షలు వేతనం అడిగాడట. అదనంగా మరికొన్ని ప్రయోజనాలు కూడా కోరాడట. దీంతో తామంత భరించే స్థితిలో లేమంటూ రిజెక్ట్‌ చేసినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు తనపై కోపంతో మ్యాట్రిమొనీ సైట్లలో తన ప్రొఫైల్‌ను తండ్రి డిలీట్‌ చేశాడని చెప్పుకొచ్చింది. ఈ తండ్రీ కూతుళ్ల ఎపిసోడ్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రముఖ మ్యాట్రిమొనీ సైట్‌ జీవన్‌ సాథీ స్పందిస్తూ.. ‘సరైన మ్యాచ్‌ ఏమైనా వెతకమంటారా’ అంటూ సరదాగా ట్వీట్‌ చేసింది. ఇక నెటిజన్లయితే ఫన్నీగా స్పందించారు. ‘మా ఆవిడకు చెప్తా. ఆమె ఓ రిక్రూటర్‌. జాబ్స్‌ కోసం మ్యాట్రమొనీ సైట్లు కూడా చూడమని’ అంటూ కామెంట్‌ పెట్టాడు. మ్యాట్రిమొనీ సైట్లు కూడా జాబ్స్‌ ఇచ్చే వేదికలుగా మారిపోయాయంటూ మరో నెటిజన్‌ ఫన్నీగా ట్వీట్‌ చేశాడు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని