ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకున్నా కరోనా టీకా

ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా టీకా తీసుకోవచ్చని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకున్నా వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు ..

Updated : 13 Mar 2021 12:14 IST

అమరావతి: ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా టీకా తీసుకోవచ్చని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకున్నా వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకునేందుకు అనుమతిస్తున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారు ఏదైనా ధ్రువపత్రం చూపించి టీకా తీసుకోవచ్చాన్నారు. 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్య ధ్రువీకరణ పత్రంతో టీకా పొందచ్చని కమిషనర్‌ తెలిపారు. వైద్య ధ్రువీకరణ పత్రం లేకున్నా ఇతర ఆధారాలు చూపితే వ్యాక్సినేషన్‌ ఇస్తారని వివరించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ఏ వ్యాక్సినేషన్‌ కేంద్రానికైనా వెళ్లి టీకా తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. 

కొవిన్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకున్న వారికే ఇప్పటి వరకు కరోనా టీకా వేస్తున్నారు. శుక్రవారం వరకు రాష్ట్రంలో 8.39లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గేసరికి చాలామందిలో భయం పోయింది. అసలు కరోనా లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆ అజాగ్రత్తే మరోసారి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. మహారాష్ట్రలో కరోనా మళ్లీ జడలు విప్పింది. ఆ రాష్ట్రంతో పాటు పంజాబ్‌లోనూ ఆంక్షలు విధించారు. అక్కడే కాదు.. మనదగ్గరా మళ్లీ కేసులొస్తున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం 210 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలోని గోపాలపట్నం జడ్పీ బాలికల ఉన్నతపాఠశాలలో నలుగురు విద్యార్థినులకు కరోనా సోకింది.  రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ పరిస్థితి రాకూడదంటే ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని