Andhra News: ఏపీలో మహిళా ఓటర్లే అధికం.. జాబితా ప్రకటించిన సీఈవో

ఆంధ్రప్రదేశ్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను చీఫ్‌ ఎలక్ట్రోలర్‌ ఆఫీసర్‌  (సీఈవో)ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. నవంబరు 9వ తేదీ నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

Published : 10 Nov 2022 01:22 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను చీఫ్‌ ఎలక్ట్రోలర్‌ ఆఫీసర్‌ (సీఈవో)ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. నవంబరు 9 నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు, 1,97,15,614 మంది పురుష ఓటర్లు, 68,115 సర్వీసు ఓటర్లు, 3,858 ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 78,438గా ఉన్నట్లు వెల్లడించారు. నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్లను  ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో జాబితా నుంచి తొలగించినట్టు చెప్పారు.  10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి డిలీట్‌ చేశామని  సీఈవో వెల్లడించారు. గతేడాది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈసారి 8,82,366 మంది ఓటర్లు తగ్గారని పేర్కొన్నారు. 

ఓటరు కార్డు కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయడం లేదని సీఈవో స్పష్టం చేశారు. అయితే, ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే 60 శాతం మేర పూర్తయిందన్నారు. ఓటరు నమోదు కోసం వాలంటీర్ల సేవలను వాడుకోవద్దని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై 19వ తేదీ వరకు విచారణ చేపడుతామని తెలిపారు. తప్పుడు ధ్రువీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి నిరాశ్రయులకు ఓటరు కార్డు ఇవ్వాలని ఈసీ నిర్ణయించిందన్నారు. ఎలాంటి గుర్తింపూ లేకపోయినా విచారణ అనంతరం వారికి ఓటరు కార్డు జారీ చేస్తామని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని