stemi project: గుప్పెడంత గుండెకు కొండంత భరోసా

గుండెపోటు బాధితుల చికిత్సకు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర చికిత్స అందుబాటులోకి వచ్చింది. గుండెనొప్పి రకాల్లో ఒకటి స్టెమీ (ఎస్టీ ఎలివేటెడ్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌)

Published : 13 Oct 2021 11:42 IST

రాష్ట్రంలోని 24 కేంద్రాల్లోస్టెమీ ప్రాజెక్ట్‌
‘గోల్డెన్‌ అవర్‌’తో తప్పనున్న ముప్పు

జనగామ జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తికి ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈసీజీ తీసిన వైద్యుడు గుండెకు సరఫరా చేసే నాళంలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. వెంటనే ఇంజెక్షన్‌ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లి శస్త్రచికిత్స చేయించడంతో అతను కోలుకున్నారు.

నిజామాబాద్‌: గుండెపోటు బాధితుల చికిత్సకు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర చికిత్స అందుబాటులోకి వచ్చింది. గుండెనొప్పి రకాల్లో ఒకటి స్టెమీ (ఎస్టీ ఎలివేటెడ్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌), రెండోది ఎన్‌స్టెమీ. రక్తనాళం పూర్తిగా పూడుకుపోయిన సందర్భంలో వచ్చే తీవ్ర గుండెనొప్పిని స్టెమీ అంటారు. దీనికి తక్షణ చికిత్స అవసరం. బాధితులను ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం 24 కేంద్రాల్లో స్టెమీ ప్రాజెక్ట్‌ పేరుతో ‘గోల్డెన్‌ అవర్‌’ చికిత్సను అందుబాటులోకి తెచ్చింది.  జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని సీహెచ్‌సీలు ఇందులో ఉన్నాయి. భవిష్యత్తులో 60 కేంద్రాల్లో ఈ సేవలందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే 35 కేంద్రాలకు యంత్రాలు సరఫరా చేశారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈసీజీ యంత్రాలు
స్టెమీ ప్రాజెక్టులో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందిన టెలీ ఈసీజీ యంత్రాలను ఎంపిక చేసిన 24 కేంద్రాలకు సమకూర్చారు. వీటిలో తీసిన ఈసీజీ రిపోర్టు ఈ యంత్రాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంస్థకు, సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించిన వైద్యుడికి, హైదరాబాద్‌లో ప్రాజెక్టును పర్యవేక్షించే నోడల్‌ అధికారికీ వెళ్తుంది. రోగి రక్తనాళంలో ఏర్పడిన పూడికను స్థానిక వైద్యుడు గుర్తించలేని పరిస్థితుల్లోనూ.. ఈ ఈసీజీ ద్వారా ‘స్టెమీ’ అని తేలితే వెంటనే థ్రాంబోలైటిక్‌ థెరపీ అందిస్తారు. రోగికి నొప్పి వచ్చాక రెండు నుంచి ఆరు గంటల్లోపు ఇంజెక్షన్లు, మందులు ఇస్తారు. రక్తస్రావమయ్యే జబ్బులున్న వారికి (పక్షవాతం, పైల్స్‌తో  బాధపడుతున్నవారికి, తలకు గాయాలైనవారికి, వృద్ధులకు) ఇవ్వరు. ఇందుకు స్ట్రెప్టోకైనేజ్, రెటిప్లేస్‌తో పాటు ఖరీదైన  టెనెక్టీప్లేస్‌ ఇంజెక్షన్లనూ ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు సగటున 200-300 మందికి టెలీ ఈసీజీ సేవలందుతున్నాయి. 

క్యాథ్‌లాబ్‌లు ఉన్న ఆసుపత్రులతో అనుసంధానం
థ్రాంబోలైటిక్‌ థెరపీతో రోగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడతాడు. ఆ తర్వాత అవసరమైన చికిత్స కోసం క్యాథ్‌ల్యాబ్‌ ఉన్న ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు 2-3 జిల్లాల ఆసుపత్రులను ఒక్కో క్యాథ్‌ల్యాబ్‌ ఆసుపత్రి పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లు ఈ సేవలందిస్తున్నాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్‌ ఎంజీఎం, ఆదిలాబాద్‌ రిమ్స్‌లలోనూ క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కార్డియాలజిస్టులు అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లోనే థ్రాంబోలైటిక్‌ థెరపీ చేసేవారు. ప్రస్తుతం ఫిజీషియన్లు, ఎంబీబీఎస్‌ వైద్యులున్న చోటా చేస్తున్నారు. నిమ్స్‌ నుంచి నిపుణులు వీడియో ద్వారా రోగిని పరిశీలించి స్థానిక వైద్యులకు సూచనలు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని