Published : 29 May 2022 01:40 IST

Health tips: గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోతున్నారా? అయితే జాగ్రత్తపడాల్సిందే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పట్టణ జీవనశైలిలో గంటల తరబడి కుర్చీల్లో కూర్చుని కంప్యూటర్‌తో కుస్తీలు పట్టడమే పని. ఉదయం కూర్చుంటే మళ్లీ పనిగంటలు అయ్యే వరకు లేవకుండా అల్పాహారం, మధ్యాహ్న భోజనం‌, సాయంత్రం స్నాక్స్‌ కూడా ఆ కుర్చీ దగ్గరకే తెచ్చేసుకుని లాగించేస్తుంటాం. దీని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను మాత్రం అంచనా వేయం. ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్‌లో వచ్చే అనారోగ్యానికి భారీ మూల్యం చెల్లించుకో తప్పదని నిపుణులు అంటున్నారు. అదేంటీ శరీరానికి శ్రమ లేకుండా చాలా సౌకర్యంగా ఉంటున్నాం కదా! దీనివల్ల అనారోగ్యం ఏముంటుంది అని మీరు ఆలోచిస్తే తప్పులో కాలేసినట్టే. ఆ వచ్చే సమస్యలేంటో తెలుసుకుందాం!


గుండెసంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం...

ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల అనేక హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముందని పరిశోధనాత్మకంగా రుజువైంది. అమెరికన్‌ కాలేజీ ఆఫ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఈ విషయాన్ని తన పరిశోధనల్లో నిరూపించింది. 


తొందరగా వృద్ధాప్య ఛాయలు

గంటల తరబడి ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కూర్చోవడం వల్ల శరీరం క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంది. చర్మం బిగుతుగా మారిపోయి, సహజత్వం కోల్పోయి తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశాలు ఎక్కువ.


మెదడు మొద్దు బారిపోతుంది

ఎక్కువగా కూర్చోవడం వల్లన మెదడు నిర్మాణం, శారీరక కదలికలకి సందేశం పంపే అవకాశం లేక మెదడు మొద్దుబారిపోతుంది. దానీవల్ల అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. 


వ్యాయామం కూడా పనిచేయదు

ఆరోగ్యవంతమైన జీవన శైలికి వ్యాయామం ఒక చక్కని చిట్కా. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించుకోవాలన్నా వైద్యులు సూచించేది వ్యాయామం. దాదాపు 7 గంటలు కూర్చుని శారీరక శ్రమకి దూరం కావడం వల్ల తరువాత ఎంత వ్యాయామం చేసినా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. 


మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ

కూర్చునే సమయంలో తక్కువ కేలరీలు బర్న్‌ అవుతాయి. దీనివల్ల శరీరంలోని వివిధ క్రియలు అదే తరహాలో జరుగుతాయి. ఎక్కువ సేపు కూర్చుని లేచిన తరువాత శారీరక క్రియలు వేగం అందుకుంటాయి. దానివల్ల శరీరంలో ఇన్సులిన్‌ల పట్ల ప్రతిచర్య ఏర్పడుతుందనేది పరిశోధకుల వాదన. డీప్‌వైన్‌ థ్రాంబోసిస్‌, రక్తం గడ్డకట్టడం, తిమ్మిర్లు, కొవ్వు శాతం పెరిగిపోవడం, జీర్ణశక్తి లోపించడం వంటి ప్రమాదాలకు కారణమవుతుంది. వీటన్నింటిని అధికమించాలంటే పనిగంటల్లో తప్పనిసరిగా లేచి అటు ఇటు నడవాలి. లిప్ట్‌లకు, ఎస్కలేటర్‌లకు ప్రాధాన్యత ఇవ్వకుండా నడవడానికి ప్రయత్నించాలి. కాళ్లు చేతులు కదుపుతూ చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.


 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని