ఆ అధ్యక్షుడి గడ్డం వెనకున్న కథ ఇది..!

అబ్రహం లింకన్‌.. అమెరికా 16వ అధ్యక్షుడు. ఒకరి శరీరకష్టాన్ని ఆస్తిగా భావించడం తగదంటూ బానిసత్వ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి. అంతర్యుద్ధంలో అమెరికా ప్రభుత్వం విజయం సాధించడానికి స్వయంగా కీలక పాత్ర పోషించారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి.. అమెరికాకు

Published : 09 Nov 2020 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అబ్రహం లింకన్‌.. అమెరికా 16వ అధ్యక్షుడు. ఒకరి శరీర కష్టాన్ని ఆస్తిగా భావించడం తగదంటూ బానిసత్వ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి. అంతర్యుద్ధంలో అమెరికా ప్రభుత్వం విజయం సాధించడానికి స్వయంగా కీలక పాత్ర పోషించారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి.. అమెరికాకు ఒక గుర్తింపు తెచ్చిన నాయకుల్లో ముఖ్యులు. అబ్రహం లింకన్‌ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది గడ్డమే. ప్రత్యక్షంగా ఆయన్ను చూసినవాళ్లు ఇప్పుడు ఎవరు లేకపోయినా.. ప్రస్తుతం ఆయన చిత్రాలు, విగ్రహాలు గడ్డంతో ఉన్నట్లుగానే దర్శనమిస్తాయి. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన గడ్డం స్టైల్‌ అంతలా ఫేమస్‌ అయింది. అయితే, లింకన్‌ గడ్డాన్ని అలా పెంచుకోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఓ పదకొండేళ్ల చిన్నారి సలహా మేరకే ఆయన గడ్డం పెంచుకున్నారట.

అమెరికాలో 1860లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అబ్రహం లింకన్‌ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా సౌథర్న్‌ డెమొక్రాటిక్‌, కాన్‌స్టిట్యూషన్‌ యూనియన్‌, నార్తర్న్‌ డెమొక్రాటిక్‌ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల ప్రకటన నాటి నుంచి అబ్రహం లింకన్‌ను సానుకూల అంశాలు ఎక్కువగా ఉండటంతో ఆయనే అధ్యక్షుడయ్యారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు.. అబ్రహం లింకన్‌కు గడ్డం ఉండేది కాదు. కోలముఖంతో చాలా బక్కపల్చగా ఉండేవారు. ఇది గమనించిన పదకొండేళ్ల గ్రేస్‌ బెడెల్‌ అనే చిన్నారి ఏకంగా అబ్రహం లింకన్‌ను ఓ లేఖ రాసింది. ‘మీరు దేశ అధ్యక్షుడు అవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నా. నాకు నలుగురు సోదరులు ఉన్నారు. వాళ్లూ, మా నాన్న మీకే ఓటు వేస్తారు. వీలైనంత మందితో మీకే ఓటు వేయిస్తాను. అయితే, ఒక్క విషయం.. మా నాన్న మీ ఫొటో ఒకటి తీసుకొచ్చారు. అందులో మీరు చాలా బక్కపల్చగా కనిపిస్తున్నారు. గడ్డం పెంచుకుంటే చక్కగా కనిపిస్తారు. మహిళలు గడ్డం ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి మీరు దాన్ని పెంచుకుంటే.. మహిళలు వారి భర్తల్ని మీకే ఓటు వేయమని చెబుతారు. తద్వారా మీరు ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్షుడు అవ్వొచ్చు’’అని లేఖ రాసింది. అంతేకాదు, ‘‘మీకు లేఖ రాసే సమయం లేకపోతే.. మీకు నాలాంటి కూతుళ్లు ఉంటే వారితో నాకు సమాధానం ఇస్తూ లేఖ రాయించండి’’అని పేర్కొంది.

1860 అక్టోబర్‌ 15న గ్రేస్‌ లేఖ రాయగా.. అక్టోబర్‌ 19న అబ్రహం లింకనే స్వయంగా స్పందించారు. తిరిగి ఆమెకు లేఖ రాస్తూ ‘‘ప్రియమైన గ్రేస్‌ బెడెల్‌ నీ లేఖ నాకు అందింది. ఇది ఎంతో అంగీకారయోగ్యమైనది. అయితే నీలాంటి కూతుళ్లు లేనందుకు చింతిస్తున్నాను. నాకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఒకరికి పదిహేడేళ్లు, మరొకరికి తొమ్మిది, ఇంకొకరికి ఏడేళ్లు. వాళ్లు వాళ్ల అమ్మతో ఉన్నారు. ఇక గడ్డం విషయానికొస్తే.. నేనెప్పుడు దానిని పెంచలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు పెంచుకుంటే ప్రజలు నన్ను చూసి వెర్రితనం అనుకుంటారని నువ్వు భావించలేదా? ఏదేమైనా నువ్వు నా శ్రేయోభిలాషివి’’ అని సమాధానమిస్తూ లేఖ పంపారు.

అయితే, అప్పటి నుంచి చిన్నారి సలహా మేరకు అబ్రహం లింకన్‌ గడ్డం పెంచుకోవడం మొదలుపెట్టారు. అధ్యక్షుడయ్యే సమయానికి ఆయన పూర్తి గడ్డంతో ఉన్నారు. 1861 ఫిబ్రవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తూ న్యూయార్క్‌లోని వెస్ట్‌ఫీల్డ్‌లో ఆగి.. చిన్నారి గ్రేస్‌ను కలిసి పలకరించడమే కాదు.. ఆమెతో ‘చూశావా? నీకోసమే ఈ గడ్డం పెంచుకున్నాను’అని వ్యాఖ్యానించారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని