అయ్యో అమ్మమ్మ...నీ బాధ తీరేదెలా?

ఆ వృద్ధురాలిపై విధికక్ష గట్టింది. అయిన వారందరిని కోల్పోయేలా చేసింది. అయినప్పటికీ దివ్యాంగుడైన మనవడికి సర్వస్వం దారపోస్తోంది. నోట్లోకి నాలుగు వేళ్లు పోని పరిస్థితుల్లో వైద్యం కోసం చేసిన అప్పులు ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాయి. ఇవ్వని చాలవన్నట్లు ఆమెపై క్యాన్సర్‌

Published : 01 Jan 2021 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ వృద్ధురాలిపై విధికక్ష గట్టింది. అయిన వారందరిని కోల్పోయేలా చేసింది. అయినప్పటికీ దివ్యాంగుడైన మనవడికి సర్వస్వం దారపోస్తోంది. నోట్లోకి నాలుగు వేళ్లు పోని పరిస్థితుల్లో వైద్యం కోసం చేసిన అప్పులు ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాయి. ఇవ్వని చాలవన్నట్లు ఆమెపై క్యాన్సర్‌ కక్షగట్టి ప్రాణాలు తోడటం మొదలు పెట్టింది. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన వృద్ధురాలు సుజాతమ్మ వ్యథ ఇది..! 

ఈ ఫోటోలో కనిపిస్తున్న బాలుడి వయసు పదిహేడేళ్లు. పేరు పవన్‌. సుజాతమ్మ మనవడు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉందతడికి. బాగుచేయించటానికి ఆర్థిక సామర్థ్యానికి మించి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. అతడికి వైద్యం చేయించటానికి వెళ్తూ తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దాంతో వారి ముగ్గురి బాధ్యత బాలుడి అమ్మమ్మ సుజాతమ్మపై పడింది. రోడ్డు ప్రమాదానికి గురైన కుమార్తె, అల్లుడి వైద్యం కోసం ఆమె అప్పులు చేసింది. ఇల్లూ తాకట్టు పెట్టింది. లక్షల రూపాయలతో శస్త్రచికిత్సలు చేయించింది. అయినా వారిద్దరినీ కాపాడుకోలేక పోయింది. 

మరోవైపు రోజురోజుకూ మనవడి పరిస్థితి విషమించింది. దాంతో 2016లో అతడి తలకు శస్త్రచికిత్స చేయించింది. అయినా అతడి మానసిక పరిస్థితి మెరుగుపడలేదు. పైగా కంటిచూపు కోల్పోయాడు. అల్లుడు, కుమార్తె కోసం చేసిన రూ. లక్షల అప్పు తీరకముందే మనవడి కోసం మరోసారి సుజాతమ్మ రుణం చేయాల్సి వచ్చింది. కుటుంబ పోషణకు అండగా ఉన్న గేదెలను అమ్మి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది.

ఇవన్నీ చాలవన్నట్లు ఆమె పైనా క్యాన్సర్‌ కక్షగట్టింది. ఆమె ప్రాణాలను తోడేస్తోంది. పవన్‌కు వైద్యం చేయించినా లాభం లేదని వైద్యులు చెప్పిన మాటతో... క్యాన్సర్‌ తనను కబళిస్తే మనవడి పరిస్థితి ఏంటని కన్నీరు మున్నీరవుతోంది సుజాతమ్మ. వీరికి దాతలు ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని స్థానికులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని