Cremation: నువ్వు మహిళవేనా.. అన్నారు

అంతిమసంస్కారాలను ఎక్కడైనా.. పురుషులే నిర్వహిస్తారు. కానీ సామాజిక కట్టుబాట్లను తెంచి, కేరళలోని ఓ మహిళ ఈ పుణ్య కార్యాన్ని నిర్వహించటంలో నిమగ్నమయ్యారు....

Updated : 08 Jun 2021 13:06 IST

కట్టుబాట్లను ఛేదించి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సుబీనా

త్రిస్సూర్​: అంతిమసంస్కారాలను ఎక్కడైనా.. పురుషులే నిర్వహిస్తారు. కానీ సామాజిక కట్టుబాట్లను తెంచి, కేరళలోని ఓ మహిళ ఈ పుణ్య కార్యాన్ని నిర్వహించటంలో నిమగ్నమయ్యారు. కుటుంబాన్ని పస్తుల బాధ నుంచి తప్పించేందుకు డిగ్రీ చదివిన ఆమె శ్మశానవాటికలో అడుగుపెట్టారు. ఏ మాత్రం భయం లేకుండా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో సూటిపోటి మాటలు ఎదురైనా ఆమె వాటిని పట్టించుకోలేదు. అందరూ చిన్నచూపు చూసే ఈ వృత్తిని ఎంతో అంకితభావంతో చేస్తున్నారు.

త్రిస్సూర్​ జిల్లాకు చెందిన సుబీనా అనే మహిళ శ్మశానవాటికలో విధులు నిర్వహిస్తున్నారు. లింగ వివక్షే కాకుండా.. మతపరంగా ఉన్న అడ్డంకులనూ ఛేదించి ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ముస్లిం మహిళ అయిన ఆమె ఈ పనిలోకి అడుగు పెట్టినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. చాలా మంది ఆమెను ‘నువ్వు మహిళవేనా?’ అని సూటిపోటి ప్రశ్నలతో వేధించారు. అయితే.. ఇన్ని సవాళ్లెదురైనా ఆమె ఈ వృత్తి ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆకలి.

సుబీనా తండ్రి ఓ చెట్టు కొమ్మ నరుకుతూ కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు ఐదు సార్లు శస్త్రచికిత్స నిర్వహించారు. దాంతో సుబీనా కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది. తన చెల్లెలి వివాహ బాధ్యతలు కూడా సుబీనా మీదే పడ్డాయి. ఆ సమయంలోనే శ్మశానవాటికలో పనిచేసే అవకాశం ఉందని తెలుసుకుంది. మరేమీ ఆలోచించకుండా ఆ పని చేసేందుకు సుబీనా ముందుకొచ్చారు. ఇందుకు ఆమె భర్త అండగా నిలిచారు. మృతదేహాలను చూసినప్పుడు భయపడతారా? అని ఆమెను ప్రశ్నించగా చిరునవ్వే సమాధానంగా ఇచ్చారు. తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకడం లేదని ఖాళీగా ఉండిపోతున్న ఎంతో మంది యవతకు సుబీనా ఆదర్శంగా నిలుస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని