వీసీ ఛాంబర్‌లో టేబుల్‌పై కూర్చొని.. తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆందోళన

తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌ నియామకంపై వివాదం కొనసాగుతోంది. ఓ పక్క రిజిస్ట్రార్‌ పదవిపై గందరగోళ పరిస్థితి నెలకొంటే.. మరోపక్క విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

Updated : 30 May 2023 14:49 IST

నిజామాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ)లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, రిజిస్ట్రార్‌ నియామకం వ్యవహారంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను నిరసిస్తూ పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు వీసీ రవీందర్‌ గుప్తా ఛాంబర్‌లో ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల నేతలు వీసీ ఛాంబర్‌లో టేబుల్‌పై కూర్చొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అవినీతి జరుగుతోందని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. పరిపాలన సంబంధిత పనులు జరగడం లేదని.. ఎవరు రిజిస్ట్రార్‌ అనేది తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని.. వీసీ నుంచి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. వీసీపై విచారణ కమిటీ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.  

రిజిస్ట్రార్‌ నియామకంలో వీసీ, పాలకమండలి (ఈసీ) మధ్య వివాదం కొనసాగుతోంది. వీసీ నియమించిన రిజిస్ట్రార్‌ను పాలకమండలి (ఈసీ) ఒప్పుకోకపోవడం.. ఈసీ నియమించిన రిజిస్ట్రార్‌ను వీసీ అంగీకరించకపోవడం.. ఇలా రెండేళ్లుగా ఈ తంతు సాగుతోంది. వర్సిటీలో రెండేళ్లలోనే ఏకంగా తొమ్మిదిసార్లు రిజిస్ట్రార్లు మారడం అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. ఎప్పుడు.. ఎవరు నియమితులవుతారో.. ఎప్పుడు పదవి నుంచి వైదొలుగుతారో తెలియని పరిస్థితి నెలకొంది. వర్సిటీ రిజిస్ట్రార్‌గా యాదగిరిని పాలకమండలి(ఈసీ) నియమించగా.. కనకయ్యను వీసీ నియమించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.  


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు