TSPSC: పేపర్‌ లీకేజీ వ్యవహారం.. మరోసారి అట్టుడికిన టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాలు

ఏఈ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాలు మరోసారి ఆందోళనలతో హోరెత్తిపోయాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల పెద్ద ఎత్తున కార్యాలయం ముట్టడికి తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 15 Mar 2023 14:25 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. పేపర్‌ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్నంతా ఆందోళనలతో అట్టుడికిన హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాలు రెండో రోజూ నిరసనలతో హోరెత్తిపోయాయి. ఏబీవీపీ, ఆప్‌, విద్యార్థి సంఘాలు కమిషన్‌ కార్యాలయానికి తరలివచ్చి నిరసన వ్యక్తం చేశాయి.

నిన్నటి ఆందోళనల దృష్ట్యా అప్పటికే టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. విద్యార్థి సంఘాల నేతల, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ వద్ద  వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాలను పోలీసులు లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించారు. పెద్ద ఎత్తున ఆందోళనలు, నినాదాలతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాలు దద్దరిల్లాయి. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి బోయిన్‌పల్లి పీఎస్‌కు తరలించారు. ‘‘ప్రశ్న పత్రాల లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలి. ప్రశ్నపత్రాలు లీకైన పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి’’ అని ఏబీవీపీ డిమాండ్ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని