Students: ఈ చిన్నారుల చేతులు అద్భుతం చేశాయ్‌!

తమ స్కూల్‌కు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తరలించాలని కోరుతూ ఇద్దరు చిన్నారులు కలెక్టర్‌కు రాసిన లేఖ ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది...

Published : 24 Oct 2021 12:47 IST

చెన్నై: చెన్నైకి చెందిన ఇద్దరు చిన్నారులు అద్భుతం చేశారు. ఎలాగైనా మందుబాబుల బెడద నుంచి తమ స్కూల్‌ని రక్షించాలని సంకల్పించారు. తమ ఆలోచనకు.. పెన్నుకున్న పవర్‌ను జోడించారు. ఏకంగా కలెక్టర్‌కే లేఖ రాశారు. మంచి చేసే వారికి మంచే జరుగుతుంది కదా మరి! అందుకే వారి నిర్మలమైన మనస్సుకి తట్టిన ఆలోచన కలెక్టర్‌ను కదిలించింది. వారి కృషి ఫలించింది. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అరియళూరు జిల్లాలో ఓ ప్రాంతంలో స్కూల్‌కు సమీపంలో మద్యం దుకాణం ఉంది. అటు నుంచి బడికెళ్లే విద్యార్థుల ముందే అక్కడ కొంతమంది మద్యం సేవించేవారు. తాగిన తర్వాత ఇష్టారీతిన వ్యవహరించేవారు. అభ్యంతరకర పదజాలం వాడుతూ దూషించుకునేవారు. ఈ పరిస్థితిని చూసి విద్యార్థులంతా భయాందోళనకు గురయ్యేవారు. కొంతమందైతే ఏకంగా స్కూల్‌కి రావడమే మానేశారు. దీన్ని గమనించిన ఇళంథెండ్రాల్(6వ తరగతి)‌, అరివరాసన్‌(4వ తరగతి) అనే ఇద్దరు అక్కాతమ్ముళ్లు కలెక్టర్‌కు లేఖ రాశారు. నవంబరులో ప్రత్యక్ష తరగతుల జరగనున్న నేపథ్యంలో అక్కడి నుంచి మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్‌ రమణ సరస్వతి.. అక్కడి నుంచి ఆ షాప్‌ను వేరే ప్రాంతానికి మార్పించారు. 

2015లో మద్రాస్‌ హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. విద్యాసంస్థలకు 100 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండొద్దు. అయితే, తాజాగా విద్యార్థులు ఫిర్యాదు చేసిన దుకాణం వంద మీటర్ల లోపు లేకపోయినప్పటికీ.. కలెక్టర్‌ దానిపై చర్యలు తీసుకోవడం విశేషం. స్కూల్‌ తరఫున పిల్లలు ప్రాతినిధ్యం వహిస్తూ చేసిన విజ్ఞప్తి మేరకే స్పందించామని వెల్లడించారు. మరోవైపు పిల్లలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సమాజాన్ని మారుస్తున్న నిజమైన నాయకులంటూ సామాజిక మాధ్యమాల్లో కీర్తిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని