TS News: సబితా ఇంద్రారెడ్డి నివాసం ముట్టడి

నగరంలోని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు.

Updated : 05 Jul 2021 10:58 IST

హైదరాబాద్‌: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీనగర్‌ కాలనీలోని ఆమె నివాసం వద్ద నిరసన తెలిపారు. విద్యార్థులందరూ దాదాపు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటారని.. అందరూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకోని నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. సత్యసాయి నిగమాగమం నుంచి సబిత ఇంటి వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో మంత్రి జోక్యం చేసుకొని ఆందోళనను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కొద్దిమంది విద్యార్థులతో మాట్లాడి.. ఇప్పటికే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్నారు. 

విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్ష కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామని మంత్రి చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించడంతో పాటు లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్‌ చేసిన విద్యార్థులు.. మంత్రి నివాసానికి సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు నగరంలో ఇంజినీరింగ్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. మీర్‌పేటలోని టీకేఆర్‌ కళాశాల గేట్‌ వద్ద విద్యార్థులను నిలిపేశారు. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.  


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని