cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?

కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు..దానికి గుండె ఒక్కసారిగా ఆగిపోవడమే కారణం.

Published : 25 Jun 2022 01:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు..దానికి గుండె ఒక్కసారిగా ఆగిపోవడమే కారణం. ఇలా గుండె ఆగిపోవడానికి ఎన్నో కారణాలున్నాయని ఇంటర్వేన్షనల్‌ కార్డియాలజిస్టు శ్రీధర్‌ కస్తూరి చెబుతున్నారు.

ఎందుకిలా..: సునామీ, తుపాన్‌ వచ్చినప్పుడు కరెంటు ఉన్నట్టుండి పోతుంది. అలాగే కొన్నిసార్లు గుండె వ్యవస్థ కూడా అనుకోకుండా కూలిపోతుంది. ఇలాంటి పరిస్థితిని వైద్యులు సడెన్‌ కార్డియాక్‌ డెత్‌గా పిలుస్తారు. మేజర్‌ హార్ట్‌ అటాక్‌ రావడం, గుండెకు రక్తసరఫరా నిలిచిపోవడంతో చనిపోతారు. డీహైడ్రేషన్‌, లూజు మోషన్‌ వాళ్లలో పొటాషియం బాగా పెరుగుతుంది. డయాలసిస్‌ రోగుల్లోనూ పొటాషియం బాగా పెరగొచ్చు. గుండె కండరాలు బలహీన పడినప్పుడు కూడా గుండె ఆగిపోవచ్చు.

అతి వ్యాయామం: క్రీడాకారులు, సినిమా హీరోలు ఫిట్‌నెస్‌ సాధించడానికి అతిగా చేసే వ్యాయామం కూడా ప్రాణాలపైకి తీసుకొస్తుంది. గుండెలో విద్యుత్తు సరిగా ఉత్పత్తి కాకపోవడం, గుండె కండరం పెరిగిపోవడం, ప్రతిభ చూపాలనే ఒత్తిడితో ప్రమాదాలు జరుగుతున్నాయి. యువకుల్లో గుండె ఆగిపోవడానికి గుండె కండరాలు అపక్రమంగా పెరిగిపోవడమే ప్రధాన కారణం.

ఎలా ఉంటుందంటే: సడెన్‌ కార్డియాక్‌ డెత్‌ వచ్చే ముందు నీరసంగా ఉండటం, తల తిరిగినట్టు ఉంటుంది. ఛాతీ నొప్పి కూడా వస్తుంది. ఛాతీ బరువుగా ఉండటంతో పాటు విపరీతంగా చెమటలు పడతాయి. కొంతమందికి ఛాతీపై కాకుండా గొంతు దగ్గర లాగినట్టు అనిపించవచ్చు. కడుపులో మంటలాగా కూడా ఉంటుంది. స్పృహ కోల్పోతారు. శ్వాస ఆగిపోతుంది. హృదయ స్పందన నెమ్మదిగా తగ్గుతుంది. 

ఏం చేయాలి: సడెన్‌ కార్డియాక్‌ అటాక్‌ వచ్చిన వ్యక్తికి గుండెపై లయబద్దంగా గట్టిగా అదమాలి. గుండెలో స్పందనలు తేవడానికి ప్రయత్నించాలి. వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించాలి. ఇక అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని