పనస పొడితో మధుమేహానికి చెక్‌!

మధుమేహంతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగిస్తూ భారతీయ వైద్యుల బృందం చేపట్టిన పరిశోధనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పనస కాయలో మధుమేహాన్ని ......

Published : 03 Jul 2021 23:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధుమేహంతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగిస్తూ భారతీయ వైద్యుల బృందం చేపట్టిన పరిశోధనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పనస కాయలో మధుమేహాన్ని అదుపు చేసే గుణాలున్నాయని శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో మెడిసిన్‌ విభాగానికి చెందిన వైద్యులు నిర్వహించిన పరిశోధనలో తేలింది. దీంట్లో ఫైబర్‌, మినరల్స్‌, యాంటీ డయాబెటిక్‌ పదార్థాలు ఉండటంతో దాని వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు ప్రయోజం ఉంటుందేమోన్న భావనతో పరిశోధకులు ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగా 2019 మే నెలలో 40 మందిపై ఏడాది పాటు పరిశోధన నిర్వహించారు. ఆస్పత్రిలో ఏడాది కాలంగా మధుమేహ వ్యాధి నియంత్రణ కోసం మాత్రలు వినియోగిస్తున్న వారికి గ్లైకాసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌ హెచ్‌ బీఏ1సి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో 6 పాయింట్లు వచ్చిన వారికి చక్కెర ఉండదు. కాగా 6 దాటి 8 పాయింట్లు వచ్చిన 40 మందిని గుర్తించి వాళ్లకు పనస పొడితో పాటు, ఇతర మందులు, ప్లాసిబో వీట్‌ ఫ్లోర్‌ను ఇచ్చారు. తర్వాత మూడు నెలలు నిశితంగా పరిశీలించారు. చివరిగా ఫలితాన్ని పరిశీలించినప్పుడు టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో ప్లాస్మా గ్లూకోజ్‌ స్థాయి బాగా తగ్గింది. మే 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకూ ఎంపిక చేసిన 18 నుంచి 60 ఏళ్ళ వయసు వారికి పనసపొడిని ఇవ్వగా, వాళ్లలో చక్కెర వ్యాధి అదుపులోకి వచ్చింది. దీంతో పనస పొడి మధుమేహాన్ని అదుపు చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తోందని పరిశోధకులు నిర్ధారించారు. అందుబాటులో ఉండే పనసకాయ పొడిని ప్రతిరోజూ భోజనంలో ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే మధుమేహ వ్యాధి అదుపులోకి వస్తుందని పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా.. పరిశోధకులు ఈ పరిశోధనకు సంబధించిన పత్రాన్ని నేచర్‌ జర్నల్‌కు సమర్పించారు. పరిశోధన పత్రాన్ని పరిశీలించిన నేచర్‌ జర్నల్‌ దీనిపై వ్యాసాన్ని కూడా ప్రచురించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని