‘కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనుమతివ్వండి’

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి  ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ ముందుకొచ్చింది....

Published : 30 Apr 2021 19:36 IST

కృష్ణా కలెక్టర్‌కు సుజనా ఫౌండేషన్ సీఈవో లేఖ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి  ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ ముందుకొచ్చింది. విజయవాడలోని తమ వెన్యూ కన్వెన్షన్ సెంటర్‌లో 100 పడకల కొవిడ్‌ సెంటర్‌ను నెలకొల్పేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనుమతులివ్వాలని కోరుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్‌కు ఫౌండేషన్ సీఈవో ఏకే రావు లేఖ రాశారు.

ఈ సెంటర్‌లో వంద పడకలతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు అవసరమైన మందులు, ఆహారాన్ని ఫౌండేషన్ సమకూరుస్తుందన్నారు. గత ఏడాది కరోనా ప్రబలిన తొలిదశలో లాక్‌డౌన్ సందర్భంగా రాష్ట్రంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5 కోట్ల విలువైన మందులు, ఆహార పంపిణీ, సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు లేఖలో పేర్కొన్నారు. వచ్చే నెలలో కన్వెన్షన్‌ సెంటర్‌లో పెళ్లిళ్లకు అడ్వాన్స్ బుకింగ్స్‌ ఉన్నప్పటికీ.. వాటిని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఎంపీ సుజనా చౌదరి సూచన మేరకు ఈ విపత్కర పరిస్థితుల్లో పేద రోగులను ఆదుకునేందుకు ఫౌండేషన్ ముందుకొచ్చింని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని