Supreme Court: ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)కు

Updated : 22 Apr 2022 14:42 IST

దిల్లీ: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)కు ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వం ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ కొనసాగించడం కుదరదని పేర్కొంది. ఏబీవీని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2020 మే 22న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నేడు కూడా విచారణ కొనసాగిస్తూ తుదితీర్పు వెలువరించింది. గురువారం జరిగిన విచారణలో రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ చేయకూడదన్న నిబంధనలను పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది.  రెండేళ్ల తర్వాత సస్పెన్షన్‌ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు, నివేదికను శుక్రవారం లోపు సమర్పించాలని ఆదేశించింది.

అప్పటి నుంచే అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి..

ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా ధర్మాసనం విచారణ కొనసాగించింది. శుక్రవారం సమర్పించిన నివేదికలో స్పష్టమైన వివరాలు లేకపోవడంతో మరికొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఏబీవీ సస్పెన్షన్‌పై రెండేళ్ల కాలపరిమితి పూర్తికావడం.. ఈ విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ చెల్లుబాటు కాదని తేలడం, స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో సస్పెన్షన్‌ రద్దయినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల సస్పెన్షన్‌ 2022 ఫిబ్రవరి 7తో ముగిసిందని.. ఆ తర్వాత రోజు నుంచి ఏబీ వెంకటేశ్వరరావుకు అన్ని రకాల ప్రయోజనాలు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే...

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవటంపై అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఆయనను విధుల్లోంచి తొలగించింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని, ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ప్రభుుత్వం  ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని