Amaravati: తుది తీర్పునకు లోబడే ఆర్‌-5జోన్‌లో పట్టాల పంపిణీ: సుప్రీంకోర్టు

రాజధాని అమరావతిలోని ఆర్‌-5జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే కనుక అది తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 17 May 2023 18:34 IST

దిల్లీ: అమరావతి ప్రాంతంలోని ఆర్‌-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌-5జోన్‌లో పట్టాలు ఇస్తే కనుక అది తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌ తీర్పునకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని తేల్చి చెప్పింది. పట్టాదారులకు థర్డ్‌ పార్టీ హక్కు ఉండబోదని ఉద్ఘాటించింది. రైతులు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

ఆర్‌-5 జోన్‌లో ఇప్పటికే ప్లాట్ల కేటాయింపులు జరిగాయని ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫు న్యాయవాదులు పేర్కొనడంతో, ప్లాట్ల కేటాయింపుపై అభ్యంతరం చెప్పబోమంది. కానీ, మూడు రాజధానులపై హైకోర్టు రిట్‌ పిటిషన్‌ తీర్పునకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని, పట్టాదారులకు థర్డ్‌ పార్టీ హక్కు ఉండబోదని తేల్చి చెప్పింది. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసమే రైతులు భూములు ఇచ్చారని సుప్రీం కోర్టుకు తెలిపారు. ఒక మహానగరం వస్తుందని హామీ ఇచ్చారన్న రైతుల తరఫు న్యాయవాది.. ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఆశచూపినట్టు తెలిపారు. 29 గ్రామాల ప్రజలు ఆ మాటలు నమ్మి.. ఎలాంటి ఆర్థిక పరిహారం తీసుకోకుండా వేల ఎకరాల భూములు ఇచ్చారని గుర్తు చేశారు. 

మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అధికారులు వెళ్లి అభివృద్ధిపై ప్రచారం చేశారన్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో నవనగరాలు ప్రతిపాదించారన్న న్యాయవాది... అవి అభివృద్ధి చెందితే ఎన్నో అవకాశాలు వస్తాయన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రూపు రేఖలు మారతాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 5శాతం భూములు ఇవ్వాలన్న రైతుల తరఫు న్యాయవాది .. రెసిడెన్షియల్‌ జోన్ల నిబంధనల ప్రకారం కేటాయింపులు ఉండాలన్నారు. నవ నగరాల్లోని ప్రతి నగరంలో రెసిడెన్షియల్‌ జోన్‌ ఉందన్నారు. ప్రభుత్వాలు మారితే ఇచ్చిన హామీలు పక్కన పెట్టలేరన్నారు. కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని గట్టిగా వాదించారు. 

అంతకు ముందే పట్టాలిస్తే ఇక చేయడానికి ఏముంటుంది?

జులైలో తుది విచారణ జరగాల్సి ఉందన్న రైతుల తరఫు న్యాయవాది.. అంతకు ముందే పట్టాలు ఇస్తే ఇక చేయడానికి ఏముంటుందని ప్రశ్నించారు. ఈ సమయంలో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2గంటలకు వాదనలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రభుత్వం తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. 2023 మార్చి 21న ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని ఆయన కోర్టుకు తెలిపారు. 34వేల ఎకరాల్లో 900 ఎకరాలే అంటే 3.1శాతమే ఈ డబ్ల్యూఎస్‌కి ఇచ్చారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఆర్‌-5జోన్‌పై ఉన్న కేసులన్నీ వ్యక్తిగతంగా వేసినవేనన్న సింఘ్వీ.. వీటిలో ఏవీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావన్నారు. ఆర్‌-5జోన్‌లో ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, వారి తరఫునే తాము వాదిస్తున్నామన్నారు. కావాలంటే ఈ-సిటీకి మరో 900 ఎకరాలు కేటాయించుకోవచ్చని చెప్పారు. ఆర్‌-3జోన్‌లో మాత్రమే భూమి తీసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఈ-సిటీకి ఇచ్చిన 6,500 ఎకరాల్లో 900 ఎకరాలు తీసుకోవద్దంటే ఎలా? అని సింఘ్వీ ప్రశ్నించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని