Supreme Court: ప్రతీకార రాజకీయాల్లోకి కోర్టులను లాగొద్దు: ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య

ప్రతీకార రాజకీయాల్లోకి కోర్టులను లాగొద్దని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.   

Updated : 07 Nov 2022 16:19 IST

దిల్లీ: మాజీ మంత్రి, తెదేపా నేత నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నారాయణ ముందస్తు బెయిల్‌ రద్దుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ నారాయణపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో హైకోర్టు నారాయణకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ నాగరత్నల ధర్మాసనం విచారణ చేపట్టింది.

నిందితుడిగా పేర్కొన్న వ్యక్తి మాజీ మంత్రి అని.. రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌, భూసేకరణలో అనేక మార్పులు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. విచారణ సంస్థలకు నారాయణ సహకరించడం లేదని, ఆ విషయాన్ని ముందస్తు బెయిల్‌ మంజూరు చేసే సమయంలో చెప్పినా హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతీకార రాజకీయాల్లోకి కోర్టులను లాగొద్దని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. బెయిల్‌పై ఉన్న నిందితులు దర్యాప్తునకు సహకరించకపోతే సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని