Biryani: సెకన్‌కు రెండు బిర్యానీ ఆర్డర్లు.. స్విగ్గీ రిపోర్ట్‌లో ఆసక్తికర అంశాలు

మన దేశంలో బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. భోజన ప్రియులు సెకన్‌కు రెండు బిర్యానీలు ఆర్డర్‌ చేశారట. ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తన వార్షిక నివేదికలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. స్విగ్గీకి వచ్చిన ఆర్డర్లలో చికెన్‌ బిర్యానీ నంబర్‌ 1 స్థానాన్ని ఆక్రమించింది.     

Updated : 17 Dec 2022 23:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా నచ్చిన ఆహారం తినాలంటే గతంలో సొంతంగా వండుకునేవాళ్లు. కొందరైతే సమీప హోటల్స్‌, బేకరీలకు వెళ్లి తినేవారు. ప్రస్తుత ఇంటర్నెట్‌ యుగంలో అంతా మారిపోయింది. ఏం కావాలన్నా, ఏం తినాలన్నా అంతా స్మార్ట్‌ ఫోన్లో ఆర్డర్‌ చేయడమే. ఆఫీస్‌ నుంచి ఆలస్యంగా ఇంటికొచ్చినా, వంట చేయడానికి ఇబ్బందిగా ఉన్నా స్మార్ట్‌ ఫోన్‌ వైపే చూస్తున్నాం. ముఖ్యంగా భోజన ప్రియుల గురించి చెప్పనక్కర్లేదు. ఏ రెస్టారెంట్‌లో ఏ ఆహారం బాగుంటుంది, టిఫిన్స్‌ ఎక్కడ బాగా చేస్తారు ఇలా వెతికేస్తున్నారు. టీ, కాఫీల నుంచి మొదలు బర్గర్లు, స్వీట్లు, బిర్యానీల వరకు అంతా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నారు. దీంతో ఆహార డెలివరీ వ్యాపారం జోరుగా సాగుతోంది.  ఈ వ్యాపారంలో స్విగ్గీ, జొమాటో యాప్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఏటా ఈ ఫుడ్‌ డెలివరీ సంస్థలకు ఎన్ని ఆర్డర్లు వచ్చాయి, ఏ ఆహార పదార్థాల పట్ల జనాలు ఇష్టం చూపిస్తున్నారు తదితర విషయాలను వెల్లడిస్తారు. తాజాగా స్విగ్గీ సంస్థ తన వార్షిక రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.     

అయితే అన్ని ఆహార పదార్థాలు ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నప్పటికీ వీటిలో కొన్నిటికే జనాలు జేజేలు పలుకుతున్నారు. వాటిలో ఒకటి బిర్యానీ. ఇలా 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కేవలం స్విగ్గీలోనే ప్రతి సెకన్‌కు 2.28 బిర్యానీలు ఆర్డర్‌ చేసినట్లు ఆ సంస్థ రూపొందించిన నివేదికలో వెల్లడైంది. ఇక దేశవ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు చేస్తున్నారట. స్విగ్గీలో ఎక్కువ మంది ఆర్డర్‌ చేసిన వాటిలో మొదటి స్థానంలో చికెన్‌ బిర్యానీ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మసాలా దోశ, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌, పన్నీర్‌ బటర్‌ మసాలా, బటర్‌నాన్‌ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఇతర దేశాల వంటకాలను సైతం మనవాళ్లు రుచి చూస్తున్నారట. వీటిలో ఎక్కువగా మెక్సికన్‌ బౌల్స్‌, కొరియన్‌ రామెన్‌, ఇటాలియన్‌ పాస్తా వంటివి ఉన్నాయట. వీటితో పాటు దేశీయ ఆహార పదార్థాల పట్ల ప్రజలు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిలో పాప్‌ కార్న్‌, సమోస, గులాబ్‌ జామ్‌ ఉన్నాయి. ఈ ఏడాది పాప్‌ కార్న్‌కు 22 లక్షల ఆర్డర్‌లు, సమోసాకు 40 లక్షల ఆర్డర్‌లు, గలాబ్‌ జామ్‌ కోసం 27 లక్షల ఆర్డర్లు వచ్చాయట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని