Updated : 28 Jun 2022 19:17 IST

CM KCR: హైదరాబాద్‌లో మరో కీలక ఘట్టం... టీహబ్‌ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: భాగ్యనగరంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకేసారి నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీహబ్‌ ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు.  హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మించింది. 53.65 మీటర్ల ఎత్తులో (రెండు బేస్‌మెంట్లు, 10 అంతస్తులు.. మూడు ఎకరాల్లో 3.6 లక్షల చదరవు అడుగుల్లో) నిర్మించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, సైయింట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, టీహబ్‌ సీఈవో శ్రీనివాస్‌రావు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. టీహబ్ ప్రాంగణం మొత్తం ఐటీ దిగ్గజాలు, అంకుర సంస్థలతో సందడిగా మారింది.

 

యువభారత్‌ సామర్థ్యం తెలపాలనే టీహబ్‌ నెలకొల్పాం : సీఎం కేసీఆర్‌

టీహబ్‌ స్థాపించాలనే ఆలోచనకు ఎనిమిదేళ్ల క్రితమే అంకురార్పణ జరిగిందని,  2015లో టీహబ్‌ మొదటి దశ ప్రారంభించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రపంచంలో యువ భారత్‌ సామర్థ్యాన్ని తెలపాలని టీహబ్‌ నెలకొల్పామన్నారు.  టీహబ్‌ నేషనల్‌ రోల్‌ మోడల్‌ నిలిచిందన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయని, అంకురాల ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. టీహబ్‌ ద్వారా అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందుతాయని, దీని ద్వారా తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందన్నారు. టీహబ్‌ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్‌, జయేశ్‌రంజన్‌కు అభినందనలు తెలిపారు. అంతకు ముందు వేదికపై స్టార్టప్‌ ప్రతినిధులను సీఎం సత్కరించారు. స్టార్టప్‌ వ్యవస్థాపకులను సీఎంకు పరిచయం చేసిన ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ...ఔత్సాహిక వ్యాపారవేత్తల గుర్తింపు టార్చ్‌ను సీఎంకు అందజేశారు.


 

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో మరింత గుర్తింపు: రానా 

సినీతారలు, క్రీడాకారులతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో హైదరాబాద్‌కు మరింత గుర్తింపు లభిస్తుందని సినీ నటుడు దగ్గుబాటి రానా అన్నారు. టీహబ్‌-2 ప్రారంభోత్సవం సందర్భంగా కీ నోట్‌ సెషన్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రానా ... స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని