Published : 07 Jul 2022 01:39 IST

‘నా పెన్ను పోయింది.. వెతికిపెట్టండి’.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ ఎంపీ

చెన్నై: తమిళనాడు కన్యాకుమారి ఎంపీ తన పెన్ను పోయిందని పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. పెన్ను కోసం పోలీస్‌ కంప్లయింట్‌ ఏంటి? ఎంపీకి పనిలేదా.. అని అనుకుంటున్నారా?  ఆ పెన్ను విలువ దాదాపు రూ.లక్ష యాభై వేలు ఉంటుందట. పైగా దాన్ని తన తండ్రి(మాజీ ఎంపీ వసంత కుమార్‌) జ్ఞాపకార్థంగా పెట్టుకున్నానని ఆయనే స్వయంగా వెల్లడించారు.

అసలేం జరిగిందంటే?

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ విజయ్‌ వసంత్‌ పెన్ను పోయిందని గిండీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అది మౌంట్‌బ్లాంక్‌ ఫౌంటెన్‌ పెన్ను అని.. దాని విలువ  దాదాపు రూ.లక్షా 50 వేల రూపాయలని తెలిపారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా జూన్‌ 30న చెన్నై వచ్చారని.. ఈ సందర్భంగా గిండీలోని స్టార్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తన పెన్నును ఎవరో దొంగలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘నా తండ్రి ఆ పెన్నును వాడేవారు. ఆయన చనిపోయాక దాదాపు రెండేళ్ల నుంచి ఆయన జ్ఞాపకార్థంగా దాన్ని నేనే ఉపయోగిస్తున్నాను. ఇటీవల గిండీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నాను. అప్పుడు నా దగ్గర పెన్ను ఉంది. కొద్దిసేపటి తర్వాత కనిపించలేదు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, డీఎంకే కూటమిలోని సభ్యులు మాత్రమే హాజరయ్యారు. బయటి వ్యక్తులు ఎవరూ రాలేదు. రద్దీ ఎక్కువగా ఉండటంతో జేబులోంచి నా పెన్ను జారీ కింద పడిపోవచ్చు. హోటల్‌ యజమాన్యాన్ని సీసీటీవీ రికార్డును చెక్ చేయమని కోరాను. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే ఫుటేజీ చెక్‌ చేస్తామని వాళ్లు చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని చెప్పారు. 

అయితే, ఎంపీ వసంత్‌ కుమార్‌ పెన్నును ఎవరో దొంగలించారని దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని చాలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీన్ని ఆయన ఖండిస్తూ.. ఇది నిజం కాదని.. పెన్ను పోయిందని మాత్రమే ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. త్వరలోనే పోలీసులు ఆ పెన్నును రికవరీ చేస్తారని విశ్వసిస్తున్నానని వసంత్‌ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని