Tamilsai: గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం సభ్యుల హక్కులకు విఘాతం: తమిళి సై

బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం వల్ల గత ఏడాదిగా ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని

Updated : 05 Mar 2022 21:44 IST

హైదరాబాద్‌: బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం వల్ల గత ఏడాదిగా ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం నుంచి రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. కానీ, గత సెషన్ కొనసాగింపు అని చెబుతున్న ప్రభుత్వం... గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై రాజకీయపరంగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. భాజపా, కాంగ్రెస్‌ దీనిపై అభ్యంతరం చెప్పగా... ప్రభుత్వం మాత్రం రాజ్యాంగానికి లోబడి నిబంధనల ప్రకారమే ఈ సెషన్‌లో గవర్నర్‌ ప్రసంగం లేదని చెప్పింది. ఈ వ్యవహారంపై రాజ్‌భవన్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. కానీ, ఆ సంప్రదాయాన్ని కొనసాగించకుండా రాష్ట్ర ప్రభుత్వం తన విజ్ఞతతో ఈ సమావేశాలను ఏర్పాటు చేసింది. కొత్త సెషన్‌ కానందున గవర్నర్‌ ప్రసంగం లేదని ప్రభుత్వం పేర్కొంది. సాంకేతిక అంశం వల్ల ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రసంగాన్ని తయారు చేయరు.. అది ప్రభుత్వ ప్రకటన. గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొన్న అంశాలపై సభలో చర్చ జరుగుతుంది. గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం మొదట చెప్పింది. ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నా సిఫార్సు కోరింది. ఇప్పుడు గవర్నర్‌ ప్రసంగం లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశా. ఆర్థిక బిల్లు సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ నాకుంది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సిఫార్సు చేశా. గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం వల్ల శాసనసభ్యుల హక్కులకు విఘాతం ఏర్పడుతుంది. గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారు’’ అని గవర్నర్‌ ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని