Tamilisai: పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ: గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై మాట్లాడారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా మారిందని ఆమె కొనియాడారు.

Updated : 03 Feb 2023 13:20 IST

హైదరాబాద్‌: దేశానికి అన్నంపెట్టే స్థాయికి చేరి తెలంగాణ ఆదర్శంగా మారిందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రజాకవి కాళోజీ వాక్కులతో గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 

‘‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని కాళోజీ అన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామంగా విలసిల్లుతోంది. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించాం. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సచివాలయం నిర్మాణం జరుగుతోంది.  దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నిర్మిస్తున్నాం. 

రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుని కలెక్టరేట్‌ భవనాల నిర్మాణం జరుగుతోంది. దేశంలోనే అత్యధికంగా 9.8లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వైద్య కళాశాలలను 3 నుంచి 17కు పెంచాం.  ఈ ఏడాది నుంచి మరో 9 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తాం. పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమంతో జీవన ప్రమాణాలు పెరిగాయి. 7.7 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చెప్పింది. హైదరాబాద్‌కు ట్రీ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌ గుర్తింపు దక్కింది. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రూ.3.31లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. ఐటీ ఉద్యోగాల్లో 140 శాతం వృద్ధి నమోదైంది. యాదాద్రి పునర్నిర్మాణం చరిత్రాత్మక అద్భుతం’’ అని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని