Taraka Ratna: తారకరత్న హెల్త్‌ అప్‌డేట్‌.. కుప్పం నుంచి బెంగళూరుకు తరలింపు

మెరుగైన వైద్య చికిత్స కోసం తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరుకు తరలించారు. అంతకు ముందు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కుప్పం చేరుకున్నారు. ఆమె నిర్ణయం మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వైద్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Updated : 28 Jan 2023 03:12 IST

కుప్పం: అస్వస్థతకు గురైన తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. అంతకుముందు తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి కుప్పం చేరుకున్నారు. ఆమె నిర్ణయం మేరకు బెంగళూరు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు. తారకరత్న గుండెలో ఎడమవైపు వాల్వ్‌ 90 శాతం బ్లాక్‌ అయిందని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించాలని కుప్పంలోని పీఈఎస్‌ ఆసుపత్రి వైద్యులు మొదట సూచించారు. ఈమేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి ఛైర్మన్‌ దేవిశెట్టిని పీఈసీ ఆసుపత్రి వైద్యులు సంప్రదించారు. దీంతో అక్కడి నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్‌ను కుప్పం రప్పించారు. ఆ అంబులెన్స్‌లోనే ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. బెంగళూరు నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు తీసుకురావడంతో కుప్పం పీఈఎస్‌ ఆసుపత్రిలోనే నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు చికిత్స కొనసాగించారు. శుక్రవారం  సాయంత్రం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కుప్పంలోని పీఈసీ ఆసుపత్రికి వచ్చి తారకరత్నను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  

ఏం జరిగిందంటే?

చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. తారకరత్న గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్‌ అయిందని  వైద్యులు గుర్తించారు. మిగత పారామీటర్స్‌ అన్నీ బాగానే ఉన్నాయని వెల్లడించారు. తారకరత్న ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆరా తీశారు. చికిత్స అందించిన కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులతో ఆయన మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని