Andhra News: గల్లంతైన జాలర్ల ఆచూకీ కనిపెట్టండి: సీఎస్‌కు చంద్రబాబు లేఖ

సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మచిలీపట్నం మండలం క్యాంబెల్‌ పేటకు చెందిన జాలర్లు చిన మస్తాన్‌, నాంచార్లు, నరసింహారావు, వెంకటేశ్వరరావుల ఆచూకీ కనిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మను తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎస్‌కు...

Updated : 06 Jul 2022 17:00 IST

అమరావతి: సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మచిలీపట్నం మండలం క్యాంబెల్‌ పేటకు చెందిన జాలర్లు చిన మస్తాన్‌, నాంచార్లు, నరసింహారావు, వెంకటేశ్వరరావుల ఆచూకీ కనిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మను తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎస్‌కు చంద్రబాబు లేఖ రాశారు. చేపల వేటకు వెళ్లిన నలుగురు జాలర్లు గల్లంతవ్వడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే లాంగ్‌ రేంజ్‌ డ్రోన్‌లతో గాలించాలని సూచించారు. జాలర్లు ఎక్కడ ఉన్నారో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియక వారి కుటుంబసభ్యులు కంటిమీద కునుకు లేకుండా కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాలర్ల ఆచూకీ తెలుసుకునే విషయంలో నాలుగు రోజులైనా ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన స్పందన లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వారి ఆచూకీ కనిపెట్టేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని