ఆనందయ్య మందుపై మరో వివాదం

కృష్ణపట్నం ఆనందయ్య మందుపై వివాదాలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఔషధం పంపిణీ నిలిచిపోయిన విషయం

Updated : 05 Jun 2021 18:50 IST

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య మందుపై వివాదాలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఔషధం పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆయుష్‌ విభాగం పరీక్షల అనంతరం ఎట్టకేలకు మందు పంపిణీకి అనుమతి లభించింది. ఈనెల 7నుంచి ఔషధం పంపిణీ చేసేందుకు ఆనందయ్య సమాయత్తమవుతున్న నేపథ్యంతో తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
 
సర్వేపల్లి వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి .. ఆనందయ్యమందుతో భారీ వ్యాపారానికి కుట్ర పన్నారని తెదేపా సీనియర్‌నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు.  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సెశ్రిత కంపెనీ ఆనందయ్య మందు పేరుతో వెబ్‌సైట్‌ తయారు చేసిందని, ఆ కంపెనీ నిర్వాహకులు ఎమ్మెల్యే కాకాణి, వైకాపాకు అత్యంత సన్నిహితులని వెల్లడించారు. నకిలీ మద్యం తరహాలోనే నకిలీ వెబ్‌సైట్‌ రూపకల్పన జరిగిందని సోమిరెడ్డి అన్నారు. ఆనందయ్య ఔషధం ఒక్కో ప్యాకెట్‌ 167 రూపాయలకు అమ్ముకునేందుకు పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు.

ఆనందయ్య కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో వెబ్‌సైట్‌ను పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి కుట్రపై సుమోటోగా కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు. మే ఒకటో తేదీ నుంచే కాకాణి పాచికలు మొదలయ్యాయని విమర్శించారు. ఆనందయ్య ఔషధంతో సొమ్ము చేసుకోవాలని కుట్రలు మొదలయ్యాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని