Andhra News: ఒంగోలు రిమ్స్‌ వద్ద తెదేపా ఆందోళన... ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు

రేపల్లె అత్యాచార బాధితురాలిని మెరుగైన వైద్యం పోలీసులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

Updated : 01 May 2022 20:41 IST

ఒంగోలు: రేపల్లె అత్యాచార బాధితురాలిని మెరుగైన వైద్యం పోలీసులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించేందుకు తెదేపా కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, యర్రగొండపాలెం పార్టీ ఇన్‌ఛార్జి ఎరిక్షన్‌ బాబు, మాజీ ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు తెదేపా నేతలు రిమ్స్‌ వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారిని ఆసుపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో తెదేపా శ్రేణులు గేటు వద్ద ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 2గంటల పాటు నిరసన కొనసాగింది. మంత్రి విడదల రజనీ, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ రిమ్స్‌కు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నాయకులకు మధ్య తోపులాట జరిగింది. తెదేపా ఎమ్మెల్యే స్వామిని బలవంతంగా అదుపులోకి తీసుకుని ఒంగోలు పోలీసు స్టేషన్‌కు తరలించారు. తోపులాటలో ఎమ్మెల్యే కాలికి స్వల్ప గాయమైంది. ఎమ్మెల్యేను పోలీసులు తీసుకెళ్తుండగా మహిళలు పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. దాదాపు 100మంది పోలీసులు అక్కడికి చేరుకుని తెదేపా నేతలను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. గేట్లన్నీ మూసివేయడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులతో పాటు, సిబ్బంది ఇబ్బంది పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని