Andhra News: బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులకు ఊరట.. నోటిఫికేషన్‌ జారీ

ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనలు సవరించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు విద్యాబోధన అంశాలపై మాత్రమే దృష్టి సారించాలని ప్రభుత్వం పేర్కొంది.

Updated : 29 Nov 2022 21:56 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక, ట్యాబ్‌ల పంపిణీ, సీబీఎస్ఈ ఆంగ్ల మాధ్యమం తదితర అంశాల పర్యవేక్షణ రీత్యా ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించే నిబంధనల సవరణకు సంబంధించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదాన్ని కూడా తీసుకుంది. వర్చువల్ కేబినెట్ ద్వారా మంత్రులకు పంపి డిజిటల్ సంతకాలతో ఈ సవరణ చేసింది.

నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009 కూడా ఉపాధ్యాయులను బోధనేతర విధులకు వినియోగించడంపై నిషేధం విధించాలని సూచిస్తోందని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. నిబంధనలు సవరించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు విద్యాబోధన అంశాలపై మాత్రమే దృష్టి సారించాలని ప్రభుత్వం పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో లేనప్పుడు ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల సవరణ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని