TS Govt: పోడు భూములకు పట్టాలు.. శబరిమల, కాశీలో వసతి భవనాలు.. కేబినెట్‌ నిర్ణయాలివే!

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.  

Updated : 09 Mar 2023 20:25 IST

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సొంత స్థలం ఉన్న పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల చొప్పున సాయం అందించాలని, రెండో విడత గొర్రెల పంపిణీకి, పోడు భూముల పట్టాల పంపిణీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్‌ నిర్ణయాలను ఆర్థికమంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్న హరీశ్‌రావు.. రాష్ట్రంలో ఈ ఏడాది 1.30లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఏటా ఆగస్టు 16న రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు వేడుకలు జరపాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు.

పేదల సొంతింటి కోసం గృహలక్ష్మి పథకం..

సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని పేదల కోసం కొత్త ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.3లక్షలు ఆర్థిక సాయం అందిస్తారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో 4లక్షల మందికి.. నియోజకవర్గానికి 3వేల మందికి చొప్పున ఇళ్లు మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కేబినెట్‌ ఆదేశించింది. ఒక్కో ఇంటికి రూ.3లక్షలు యూనిట్‌ కాస్ట్‌గా నిర్ణయించారు. ఒక్కో దఫా రూ.లక్ష చొప్పున 3 విడతల్లో రూ.3లక్షలు విడుదల చేస్తారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు కేటాయించినట్టు ఆర్థికమంత్రి హరీశ్‌ రావు తెలిపారు. గతంలో పేద వర్గాలకు గృహనిర్మాణ సంస్థ ద్వారా ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు రూ.4వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. పేదలను రుణవిముక్తులను చేసేందుకు వారి తరఫున రూ.4వేల కోట్లను ప్రభుత్వమే చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

4లక్షల  ఎకరాల పోడు భూములకు పట్టాలు..

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కోసం 7.31లక్షల మంది లబ్ధిదారులను గతంలోనే గుర్తించారు. అందులో రెండో విడత పంపిణీ చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. రెండో విడత కార్యక్రమం ఏప్రిల్‌లో ప్రారంభించి ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్రంలో 4లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 1,55,393 మంది అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గుర్తించిన లబ్ధిదారులకు పట్టాలు ముద్రించి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పోడు భూముల పంపిణీ వెంటనే ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది. హైదరాబాద్‌ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణం పూర్తయింది. ఏప్రిల్‌ 14న ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రంలోని దళితులందరినీ హైదరాబాద్‌కు తీసుకొచ్చి లక్షలాది మంది సమక్షంలో ఒక గొప్ప పండుగ మాదిరిగా ఈ కార్యక్రమం నిర్ణయించాలని, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం జీవో 58, 59 కింద సకాలంలో కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారని, కటాఫ్‌ డేట్‌ రిలాక్సేషన్‌ ఇవ్వాలని ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు అందాయి. ఆ విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని మరోసారి వారికి అవకాశం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. జీవో 58 కింద ఇప్పటి వరకు 1,45,668 మందికి పట్టాలు పంపిణీ చేశారు. 59 జీవో కింద ఇప్పటి వరకు 42 వేల మంది లబ్ధి పొందారు. మిగిలిపోయిన లబ్ధిదారులకు మరో నెల రోజుల సమయం ఇచ్చి దరఖాస్తులను పరిశీలించనున్నారు. 

కాశీ, శబరిమలలో రూ.50కోట్లతో వసతి గృహాల నిర్మాణం

సనాతన ధర్మాన్ని పాటించే చాలా మంది భక్తులు కాశీకి వెళ్తుంటారు. రాష్ట్రం నుంచి కాశీయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్న నేపథ్యంలో కాశీలో కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఒక వసతి గృహం  నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయించిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాశీలో నిర్మించే వసతి గృహానికి రూ.25కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం వేగంగా పూర్తి చేసేందుకు సీఎస్‌, మంత్రల బృందం కాశీ వెళ్లి అక్కడి అధికారులతో చర్చించనుంది. ప్రభుత్వ స్థలం లభ్యం కాకపోతే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి అన్ని వసతులతో కూడిన సముదాయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే తెలంగాణ నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున శబరిమల వెళ్తుంటారు. అక్కడ వసతులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శబరిమలలో కూడా రూ.25కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడి నుంచి వెళ్లే భక్తుల కోసం అన్ని వసతులతో కూడిన భవనం నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనికి సంబంధించిన బాధ్యతలు సీఎంవో అధికారిణి ప్రియాంక వర్గీస్‌కు అప్పగించారు. గతంలోనే సీఎం కేసీఆర్‌ కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు.. శబరిమలలో మంచి స్థలం ఇచ్చేందుకు ఆ రాష్ట్ర సీఎం అంగీకరించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని