Telangana News: 11న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ

అదనపు ఆర్థిక వనరులు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రి వర్గం గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన 11వ తేదీ మధ్యాహ్నం...

Updated : 09 Aug 2022 16:24 IST

హైదరాబాద్‌: అదనపు ఆర్థిక వనరులు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన 11వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్‌ భేటీ కానుంది. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించింది. రూ.53వేల కోట్లలో కేంద్రం రూ.15వేల కోట్లు కోత విధించిందని ఇటీవల సీఎం తెలిపారు. దీంతో పాటు ప్రాజెక్టులు సహా ఇతరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం.. ఇందుకు సంబంధించి కసరత్తు చేసింది.

నిరుపయోగంగా ఉన్న భూములు, రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల విక్రయం, పన్నేతర ఆదాయం పెంచుకోవడం లాంటి వాటిని ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. వాటితో పాటు సంబంధిత అంశాలపై మంత్రివర్గంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త పింఛన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది. శాసనసభ ప్రత్యేక సమావేశం, స్థానిక సంస్థల సమావేశాలపై కూడా చర్చించనున్నారు. వీటితో పాలనాపరమైన అంశాలు, రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక, పార్టీ వ్యూహం, సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని