Telangana News: పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి ప్రక్రియ సక్రమంగా

Published : 14 Apr 2022 01:16 IST

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్లు, అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని.. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్‌ పేర్కొన్నారు.

‘‘స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర జిల్లా స్థాయి అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి. గత యాసంగిలో ఏర్పాటు చేసినన్ని కేంద్రాలు.. అవసరమైతే అంతకన్నా ఎక్కువ ఏర్పాటు చేయాలి. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలి. గన్నీ బ్యాగుల సేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రత్యేకాధికారిని నియమించి పర్యవేక్షించాలి. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1960కి కొనుగోళ్లు జరగాలి. వ్యవసాయ విస్తరణాధికారుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. వారి వద్దనున్న వరి కోతల వివరాల ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించాలి. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు వాహనాల ఏర్పాట్లను చేసుకోవాలి. ప్రతి రోజు ధాన్యం సేకరణ వివరాలతో కూడిన నివేదికలు సమర్పించాలి. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం పోలీసు, రవాణా తదితర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి’’ అని సీఎస్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని