Lockup death: మెదక్‌ లాకప్‌ డెత్‌ ఘటనపై డీజీపీ అగ్రహం.. ఐజీ చంద్రశేఖర్‌కు విచారణ బాధ్యతలు

మెదక్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు దెబ్బలకు తీవ్ర అనారోగ్యానికి గురైన ఖదీర్‌ఖాన్‌ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డీజీపీ అంజనీ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 18 Feb 2023 17:34 IST

హైదరాబాద్‌: మెదక్‌ (Medak) పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌ (Lockup death) ఘటనపై డీజీపీ అంజనీకుమార్‌ (DGP Anjani Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఐజీ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కామారెడ్డికి చెందిన సీనియర్‌ పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని, ఐజీ చంద్రశేఖర్‌ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ సూచించారు. మెదక్‌ సీఐ, ఎస్‌ఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

ఇదీ చదవండి: పోలీస్‌ దెబ్బలకే కన్నుమూశాడు!

మెదక్‌ పట్టణానికి చెందిన ఖదీర్‌ఖాన్‌.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీ రాత్రి మృతి చెందాడు. దొంగతనం కేసులో ఖదీర్‌ఖాన్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందాడంటూ ఆయన భార్య సిద్ధేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 27న మెదక్‌ పట్టణంలోని అరబ్‌ గల్లీలో గొలుసు దొంగతనం జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఖదీర్‌ఖాన్‌ను గత నెల 29న అదుపులోకి తీసుకున్నారు. 2వ తేదీ వరకు పీఎస్‌లోనే ఉంచి, ఆ తర్వాత అతని భార్యను పిలిపించి ఖదీర్‌ను ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఖదీర్‌ అనారోగ్యం పాలవ్వడంతో మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఖదీర్‌ మృతి చెందడంతో నిన్న పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని