Telangana News: తెలంగాణలో కొవిడ్‌ మూడో దశ ముగిసిపోయినట్లే!: డీహెచ్‌

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాసరావు అన్నారు.

Updated : 08 Feb 2022 19:32 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.శ్రీనివాసరావు అన్నారు. జనవరి 23న మూడో దశ ఉద్ధృతి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని.. ప్రస్తుతం 2శాతం కంటే తక్కువ ఉందని ఆయన వివరించారు. తెలంగాణలో కరోనా మూడో దశ ముగిసిపోయినట్లే అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై డీహెచ్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

ఫీవర్‌ సర్వే వల్ల సత్ఫలితాలు

‘‘టీకా తీసుకున్న వారిలో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంది. ఫీవర్‌ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్‌ ఆంక్షలు లేవు. కరోనా మూడో దశ ముగిసినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి. కొవిడ్‌ మొదటి దశ వల్ల దాదాపు 10 నెలలు ఇబ్బంది పడ్డాం. రెండో దశ ఆరు నెలలు ఉంది. మూడో దశలో 28 రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటోంది. ఫీవర్ సర్వే వల్ల సత్ఫలితాలు వచ్చాయి. కొవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పని చేసింది.

రెండు నెలల్లోనే అదుపులోకి మూడో దశ

మూడో దశ కేవలం రెండు నెలల్లోనే అదుపులోకి వచ్చింది. ఈ దశలో టీకా తీసుకొని వారు 2.8శాతం మంది ఆస్పత్రి పాలయ్యారు. 31 లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశాం. మూడో దశలో జనవరి 25న అత్యధికంగా 4,800 కేసులు నమోదయ్యాయి. ఈ దశ మొత్తంలో కేవలం 3వేల మంది రోగులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు. ఇటీవల నిర్వహించిన ఫీవర్ సర్వేలో నాలుగు లక్షల మందికి కిట్‌లు అందజేశాం.

పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు వెళ్లొచ్చు

కొవిడ్‌ ఆంక్షలు లేనందు వల్ల అన్ని సంస్థలు 100శాతం పని చేయొచ్చు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు వెళ్లొచ్చు. ఐటీ కంపెనీలు సైతం వర్క్‌ ఫ్రం హోం తీసివేయవచ్చు. విద్యాసంస్థలను పూర్తిగా ప్రారంభించాం. ఆన్‌లైన్‌ తరగతులతో పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయి. మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు, 150 బెడ్స్‌ కలిగిన ఆస్పత్రిని సిద్ధం చేశాం. అవసరమైన పరీక్షలు అక్కడే చేస్తాం.

వచ్చే కొద్ది నెలల పాటు కొత్త వేరియంట్‌ పుట్టే అవకాశం లేదు

రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి టీకాలు వేశాం. 82శాతం మందికి రెండు డోస్‌ల టీకా అందించాం. టీనేజర్లలో 73శాతం మందికి తొలిడోస్‌, 13శాతం మందికి రెండో డోసు వ్యాక్సిన్‌ ఇచ్చాం. రాష్ట్రంలో కేవలం నిజామాబాద్‌, అసిఫాబాద్‌ జిల్లాలు మినహా అంతటా 100శాతం తొలిడోస్‌ పూర్తి అయింది. వచ్చే కొద్ది నెలల పాటు కొత్త వేరియంట్‌ పుట్టే అవకాశం లేదు. కొవిడ్‌ త్వరలో ఎండమిక్‌ అవుతుంది. భవిష్యత్‌లో సాధారణ ప్లూలా కొవిడ్‌ మారుతుంది’’ అని డీహెచ్ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని