Updated : 28/04/2021 16:18 IST

TS Corona: ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి

ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌

హైదరాబాద్: గత వారం రోజులుగా తెలంగాణలో పరిస్థితులు కొంతమేర కుదుటపడుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ అన్నారు. కొవిడ్‌ కేసుల పెరుగుదలలో స్థిరత్వం కనిపిస్తోందని చెప్పారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌పై ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సహకరిస్తున్నారని.. వచ్చే మూడు, నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. వచ్చేది పెళ్లిళ్లు, పండగల సీజన్‌ కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

లక్షణాలు ఉన్నవారికే కరోనా టెస్టులు చేస్తున్నట్లు డీహెచ్‌ తెలిపారు. విరేచనాలు, జ్వరం, వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం లాంటి కొవిడ్ లక్షణాలు ఉన్నవారే టెస్టుకు రావాలన్నారు. కొవిడ్‌ టెస్టింగ్ కేంద్రాల్లో గుంపులుగా ఉండటం సరికాదని.. సాధారణ లక్షణాలు రెండు మూడు రోజులకుగానీ తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కొవిడ్‌ బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా పడకలు అందుబాటులో ఉన్నాయని.. బాధితుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పడకల సంఖ్యను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కరోనా బాధితులకు 50 వేల పడకలు కేటాయించామని తెలిపారు. వైరస్‌ సోకిన 85 శాతం మందికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని.. అవసరమైతే తప్ప ఆస్పత్రులకు రావొద్దని డీహెచ్‌ ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్షిస్తున్నారని తెలిపారు. 

‘‘అవసరం లేకుండానే ప్రజలు ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడింది. ఆక్సిజన్‌, ఔషధాలు, పడకల విషయంలో మనం మెరుగైన స్థితిలో ఉన్నాం. ఏడాదిన్నరగా ప్రజారోగ్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ప్రజలకు సేవ చేస్తున్నారు. మే నెలాఖరు వరకు ప్రజలు సామాజిక బాధ్యతగా మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు పాటించండి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 45 లక్షల మందికి టీకా ఇచ్చాం. టీకా వేసుకున్నవారిలో ఎవరూ తీవ్రమైన అస్వస్థతకు గురికాలేదు. టీకా వేసుకున్న వారికి వైరస్‌ సోకినా ఆస్పత్రిలో చేరలేదు. టీకా వేసుకున్న వారిలో 80 శాతం మందికి కొవిడ్‌ సోకలేదు. 18 ఏళ్లు పైబడిన వారు టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది’’ అని డీహెచ్‌ వివరించారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని