Updated : 10 Jun 2022 16:20 IST

Telangana News: కరోనా ఫోర్త్‌వేవ్‌పై డీహెచ్‌ ఏమన్నారంటే..!

హైదరాబాద్‌: తెలంగాణలో కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని.. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘తెలంగాణలో గత వారం 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 555 కేసులు నమోదయ్యాయి. దాదాపు 56శాతం పైగా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 36వేలకు పైనే ఉండగా.. తెలంగాణలో 811 మంది బాధితులు ఉన్నారు. థర్డ్‌ వేవ్‌లో ఒమిక్రాన్‌ కేసులు భారీగా వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టి.. మళ్లీ గత రెండు వారాలుగా కొత్త కేసుల పెరుగుదలను చూస్తున్నాం. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరికలు, మరణాలు దాదాపు సున్నాగానే ఉన్నాయి. తెలంగాణలో 811 క్రియాశీల కేసులు ఉంటే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం కేవలం రెండు మూడు మాత్రమే ఉన్నాయి. మరణాలు కూడా గత రెండు నెలల నుంచి సున్నాగానే కొనసాగుతున్నాయి.  గత మూడు రోజుల నుంచి 100కు పైగా కేసులు వస్తున్నాయి. రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు రావడం చూస్తున్నాం’’ అని డీహెచ్‌ వివరించారు.

ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ!

‘‘దేశంలో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గాని ఫోర్త్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు అతి స్వల్పంగానే ఉండే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్‌ కవరేజీ దాదాపు నూరు శాతం కావడం వల్ల ఎక్కువ మందిలో ఇమ్యూనిటీ తీసుకురాగలిగాం. ఇప్పుడు కేసులు కొంచెం పెరుగుతున్నా.. ఫోర్త్‌వేవ్‌కు కారణం కాకపోవచ్చు. మే నెల నుంచి ఇప్పటివరకు ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ బీఏ 2 కేసులే దాదాపు 65శాతం నమోదయ్యాయి. గత రెండు రోజుల నుంచి బీఏ 4, బీఏ 5 వేరియంట్లకు  సంబంధించిన కేసులు పెరుగుదల చూస్తున్నాం. ఈ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లతో ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశం లేదు’’ అని పేర్కొన్నారు.

కరోనా ఇంకా పోలేదు.. మనతోనే ఉంది!

‘‘కరోనా వైరస్‌ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. మనతో పాటే ఉంది. ఇది పూర్తిగా నిర్మూలన అయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. పాండమిక్‌గా మొదలైన ఈ మహమ్మారి.. ప్రస్తుతం ఎండమిక్‌ స్టేజిలో కొనసాగుతోంది. ఈ డిసెంబర్‌ నాటికి లేదా వచ్చే ఏడాది మధ్య కల్లా పూర్తిగా ఎండమిక్‌ స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇంకో ఆర్నెళ్ల పాటు ఇలాంటి కేసుల పెరుగుదల అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇలా కేసులు పెరగడాన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణకు ఏకైక అస్త్రంగా ఉన్న మాస్క్‌ను పెట్టుకోండి. బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణాలో ప్రయాణించేటప్పుడు మాస్క్‌ పెట్టుకోవడం మరిచిపోవద్దు. ఈ వర్షా కాలం ఫ్లూ సీజన్‌ గనక ఆ లక్షణాల నుంచి కొవిడ్‌ను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీ నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూసుకోండి. పిల్లలకు వ్యాక్సినేషన్‌ వేయించడం అత్యంత అవసరం. 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. ఈ వయస్సు పిల్లలకు దాదాపు 90శాతం మేరకు టీకా ఇచ్చాం. కానీ, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ కవరేజీ చాలా తక్కువగా ఉంది. త్వరలోనే పాఠశాలలు తెరుచుకోనుండటంతో పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలందరికీ టీకాలు వేయించేలా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని డీహెచ్‌ సూచించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని