ప్రభుత్వ బ్యాంకు ఖాతాల దుర్వినియోగానికి అడ్డుకట్ట.. తెలంగాణ సర్కార్‌ మార్గదర్శకాలు

ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఖాతాలు ఏ విధంగానూ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి

Published : 22 Feb 2022 01:38 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఖాతాలు ఏ విధంగానూ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా, మోసపూరిత విధానంలో కొన్ని సందర్భాల్లో డిపాజిట్ల నుంచి నగదు తీయడం.. అనుమతి లేకుండా కొత్త ఖాతాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తున్న నేపథ్యంలో ఆర్థికశాఖ వాటిని అరికట్టే దిశగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఖాతాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని... ఆయా ఖాతాలకు ప్రభుత్వ అనుమతి ఉందా.. లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 10వ తేదీ నాటికి ప్రభుత్వం సూచించిన విధానంలో నివేదిక సమర్పించాలని అన్ని శాఖలకు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని మార్గదర్శకాలు..

* ప్రస్తుతం ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఖాతాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించి ఎంప్యానెల్ చేసిన బ్యాంకులో ఒకే ఖాతాగా ఉంచాలి.

ప్రభుత్వం ఎంప్యానెల్ చేసిన బ్యాంకుల్లోనే ఖాతాలు ఉండాలి.

* ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఖాతాలు తెరవాలి.

* ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ఖాతాలో జమ చేసేందుకు వీల్లేదు.

* బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఖాతాలను సంబంధిత శాఖాధిపతి, డ్రాయింగ్ లేదా ఫైనాన్స్ అధికారులు ఎప్పటికప్పుడు సంయుక్తంగా పర్యవేక్షించాలి.

* భౌతిక, ఆన్‌లైన్‌ రికార్డులను పక్కాగా నిర్వహించి ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయించాలి.

* ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ లావాదేవీలను సంబంధిత శాఖల ఖాతాలకు ఎలక్ట్రానిక్ రూపంలోనే నిర్వహించాలి. నగదు లావాదేవీలను అనుమతించరాదు.

* ప్రభుత్వ ఖాతాలన్నీ అధికారిక ఈ-మెయిల్స్, మొబైల్ నంబర్లకు మాత్రమే లింక్ చేయాలి.

* ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల బాండ్ల సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి.

* ఏ ఒక్క ప్రభుత్వ శాఖ, సంస్థ, కార్పొరేషన్లు.. అన్ని రకాల ఖాతాలను కలిపి మూడుకు మించి బ్యాంకుల్లో కొనసాగించరాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని