
TTD: తిరుమల శ్రీవారికి గోదా మాలల సమర్పణ.. వైదికోక్తంగా కాకబలి
తిరుమల: శ్రీగోదాదేవి పరిణయోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి మూలవిరాట్‌కు ఆదివారం ఉదయం గోదామాలలు సమర్పించారు. తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీగోదాదేవి చెంత నుంచి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలలు తిరుపతి నుంచి తిరుమల పెద్ద జియర్‌స్వామివారి మఠానికి ఆదివారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం అక్కడ నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.
వైదికోక్తంగా ‘కాకబలి’..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏటా కనుమ పండుగను పురస్కరించుకొని ఉదయపూర్వం నిర్వహించే ‘కాకబలి’ కార్యక్రమం ఆదివారం వైదికోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా అర్చకులు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో తమిళిసై..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గవర్నర్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి రెడ్డి స్వాగతం పలికారు. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని శ్రీనివాసుడిని కోరుకున్నట్లు తమిళిసై తెలిపారు. కరోనా బారి నుంచి తప్పించుకొనేందుకు ప్రతి ఒక్కరూ రెండు టీకాలు వేసుకోవాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.