ఏ రాష్ట్రం నుంచైనా తెలంగాణకు రావచ్చు: డీహెచ్‌

వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని, ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు.

Updated : 14 May 2021 15:26 IST

హైదరాబాద్‌: వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని, ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌ వచ్చే రోగులను సరిహద్దులోనే ఆపివేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.

‘‘పొరుగు రాష్ట్రం నుంచి బయలుదేరడానికి ముందే ఇక్కడి ఆస్పత్రిని సంప్రదించాలి. దాదాపు 45శాతం పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో ఉండేవి. పడకలు లేకుండా వచ్చి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయమై ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల ప్రభుత్వాలకు సీఎస్‌ లేఖ రాశారు. ఆస్పత్రి వారే రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు పంపుతారు. ఆ వివరాలను పరిశీలించి అనుమతిస్తాం. ఇతర రాష్ట్రాల ప్రజలకు వైద్యం చేయబోమని మేము ఎప్పుడూ చెప్పలేదు. ఏ రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవట్లేదు.  ఈ రోజు ఉదయం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐదుగురు రోగులను రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్స్ కోసం స్టేట్ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.  మన దగ్గర మెడిసిన్, బెడ్స్‌ని ఇతర రాష్ట్రాల వారితో పంచుకుంటున్నాము. బిహార్, దిల్లీ నుంచి సైతం రోగులు ఇక్కడికి వస్తున్నారు. కేంద్రం ఇస్తున్న ఆక్సిజన్ ఏ రోజుకి ఆ రోజే సరిపోతుంది. దీంతో ఆక్సిజన్‌ ఆడిట్‌ విధానం పెట్టుకున్నాం. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రం నుంచైనా తెలంగాణకు రావచ్చు’’

నిమిషాలు.. గంటల్లోనే అనుమతిస్తున్నాం

‘‘బెడ్ లేకుండా వచ్చి ఎవరూ ఇబ్బంది పడటం సరికాదు. రాష్ట్రంలో ఉన్న 15-20 పెద్ద ఆస్పత్రుల్లోనే అందరికీ బెడ్స్‌ కావాలి. అందుకోసం మేము లైవ్‌ డాష్‌ బోర్డ్‌ తీసుకొచ్చాం. పెషెంట్‌ ఏదైనా ఆస్పత్రికి వెళ్లడానికి ముందు రోగి పరిస్థితిని బట్టి నోడల్‌ ఆఫీసర్‌ ఆస్పత్రిలో మాట్లాడి అనుమతి ఇస్తారు. అప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందవచ్చు. అలా కాకుండా బెడ్స్‌ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు పడకల వివరాలను లైవ్‌లో అప్‌డేట్‌ చేసుకుంటూ వెళ్తున్నాం. నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. దీనికి ఇతర రాష్ట్రాల అధికారులు సహకరించాలి. నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకూ 5-7మందికి అనుమతి ఇచ్చాను. దరఖాస్తు చేసుకున్న కొన్ని నిమిషాలు, గంటల్లోనే అనుమతి ఇస్తున్నాం. అందుకోసం 24 గంటలూ టీమ్స్‌ పనిచేస్తున్నాయి’’

ముందుగా బెడ్‌ రిజర్వ్‌ చేసుకోవాలి

‘‘ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోని ఆస్పత్రుల్లో చేరాలనుకునే వారు ముందుగా బెడ్‌ను రిజర్వ్‌ చేసుకోవాలి. ఆ తర్వాతే వాళ్లు బయలుదేరాలి. ఇక బెడ్‌ రిజర్వ్‌ చేసుకున్న ఆస్పత్రి వర్గాలు మాకు ఒక పద్ధతి ప్రకారం రోగి సమాచారాన్ని అందిస్తారు. మేము దాన్ని పరిశీలించి, వెంటనే అనుమతి జారీ చేస్తాం. ఆ ధ్రువీకరణ పత్రాన్ని రాష్ట్ర సరిహద్దులో ఉన్న మా బృందాలకు పంపిస్తాం. వారు దాన్ని పరిశీలించి వెంటనే రోగులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. చాలా సులభంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. రిజర్వ్‌ చేసుకున్న బెడ్‌ను మరో రోగికి కేటాయించడానికి లేదు. దీని వల్ల ఇతర రాష్ట్రాల నుంచి రోగి రాగానే చికిత్స మొదలు పెట్టడానికి అవకాశం కలుగుతోంది’’

ఇప్పటికీ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నాం

‘‘సెకండ్‌వేవ్‌లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గతంలో ఎవరైనా కరోనా బాధితుడు ఆస్పత్రిలో చేరితే వారంలో డిశ్చార్జీ అయ్యేవారు. ఇప్పుడు రెండు, మూడు వారాలు పడుతోంది. రాష్ట్రంలో 18వేల బెడ్స్‌ నుంచి 53వేల బెడ్స్‌ ఏర్పాటు జరిగింది. ఇతర రాష్ట్రాల వారినే కాదు, మన రాష్ట్రంలోని వారికి కూడా మెరుగైన చికిత్స అందించాలి కదా! మనకు కేటాయించే ఆక్సిజన్‌, ఔషధాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి జిల్లా బోర్డర్‌ వద్ద పోలీస్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే వారిని ఆపడం లేదు. ఇప్పటివరకూ మేము ఎప్పుడూ అంబులెన్స్‌ను ఆపలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ మానవతా దృక్పథంతోనే వ్యవహరిస్తోంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే అనుమతిస్తామని చెప్పడం లేదు కదా! రాష్ట్రానికి ఎవరైనా రావచ్చు. అయితే, ఇక్కడ సరైన వనరులు ఉన్నాయో లేదో ముందుగా తెలుసుకోండి’’

45శాతం ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు

‘‘రెండో దశలో ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలు 80శాతం నిండిపోయాయి. ఇందులో 45శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. పడకలు పెంచుకుంటూ పోతే సమస్య పరిష్కారం కాదు. అదే సమయంలో కేంద్రం కేటాయింపులు కూడా పెంచదు కదా! 17 జిల్లాల కలెక్టర్లు, సీపీలు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించాం. అనుమతి ఉన్న ప్రతి ఒక్కరినీ రాష్ట్రంలో పంపాలని సూచించాం. అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాటు చేశాం. ఐసీయూ, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్స్‌ అన్నీ అందుబాటులో ఉన్నాయి. నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని