MLAs Bribery case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టులో బీఎల్‌ సంతోష్‌ లంచ్‌మోషన్‌ పిటిషన్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) జారీ చేసిన నోటీసులపై భాజపా నేత బీఎల్‌ సంతోష్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నోటీసులను రద్దు చేయాలని బీఎల్‌ సంతోష్‌ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 25 Nov 2022 16:01 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) జారీ చేసిన నోటీసులపై భాజపా నేత బీఎల్‌ సంతోష్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వ్యవహారంలో విచారణకు ఈనెల 26న లేదా 28న హాజరు కావాలని బీఎల్‌ సంతోష్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను రద్దు చేయాలని బీఎల్‌ సంతోష్‌ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

గతంలో సిట్‌ నోటీసులపై భాజపా రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సంతోష్‌ను అరెస్టు చేయొద్దని సిట్‌ అధికారులను ఆదేశిస్తూ.. సంతోష్‌ విచారణకు సహకరించాలని పేర్కొంది. అయితే, సిట్‌ పేర్కొన్న తేదీల్లో సంతోష్‌ విచారణకు హాజరుకాలేకపోయారు. హాజరుకాలేకపోవడానికి గల వివరాలను సైతం ఇవాళ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌లో సంతోష్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. తనకు వీలైన రోజున విచారణకు పిలవాలని సిట్‌ను కోరినట్లు పేర్కొన్నారు. దీనికి సిట్‌ కూడా అంగీకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్‌ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధంలేదని.. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. కేసును అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అంగీకరించిన హైకోర్టు మరికాసేపట్లో దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు