TS High Court: నిమజ్జన సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదా?: హైకోర్టు

కరోనా, కాలుష్య పరిస్థితుల్లో వినాయక నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన సరిగా లేదని తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Updated : 07 Sep 2021 14:59 IST

హైదరాబాద్‌: కరోనా, కాలుష్య పరిస్థితుల్లో వినాయక నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన సరిగా లేదని తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిమజ్జన సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. వినాయక నిమజ్జనం ఆంక్షలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రిజర్వ్‌ చేసింది. 

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనం నిషేధించాలని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. వినాయక నిమజ్జనంపై సూచనలు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వ విభాగాలు నివేదిక సమర్పించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్‌ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ సీపీకి నివేదిక ఇచ్చే తీరికే లేదా? అని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. 

దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ జీహెచ్‌ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లోనూ నిమజ్జన ఏర్పాట్లు చేశామని తెలిపారు. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని.. లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని హైకోర్టుకు వివరించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని వ్యా్ఖ్యానించింది. కాలుష్యం, వాతావరణ మార్పులతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఇప్పటికే వివిధ దేశాలు సతమతవుతున్నాయని హైకోర్టు గుర్తు చేసింది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేక పోతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ ప్రభుత్వ ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని