Telangana News: కేంద్రంపై సమరానికి తెరాస సిద్ధం.. డిసెంబరులో శాసనసభ సమావేశాలు?

కేంద్రం వైఖరిని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చె నెలలో(డిసెంబరులో) వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. 

Updated : 24 Nov 2022 18:22 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయ అలజడి కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఇంకోవైపు దిల్లీ మద్యం కేసు, మధ్యలో ఐటీ, ఈడీల దాడులు, విచారణలతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న వాతావరణం నెలకొంది. ఈనేపథ్యంలో కేంద్రం వైఖరిని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో(డిసెంబరు) వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ఆంక్షలపై సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని భావిస్తున్నారు. ఈమేరకు సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. కేంద్రం విధించిన ఆంక్షల కారణంగా రాష్ట్ర ఆదాయం రూ.40వేల కోట్ల వరకు తగ్గుతోందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుకట్ట వేస్తోందని తెరాస సర్కారు ఆరోపిస్తోంది. దీంతో అన్ని విషయాలు ప్రజలకు తెలియజేసేందుకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.   

ఈడీ, ఐటీ దాడులతో కలకలం..

ఒక మంత్రిపై గ్రానైట్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ జరపగా, అది ముగియకముందే మరో మంత్రి లక్ష్యంగా పెద్దఎత్తున ఆదాయపన్ను శాఖ దాడులు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. మరో మంత్రి కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సహాయకుడిని కూడా ఈడీ విచారించింది. మరికొందరిపైనా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంటుందని అందరూ భావించగా, అందుకు భిన్నంగా ఈడీ, ఐటీ, సిట్‌ కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. సీబీఐ అడుగుపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం కావడంతో అది నేరుగా కేసులు నమోదు చేయలేకపోతోందని, లేకుంటే ఆ సంస్థ కూడా రాష్ట్రంలో చురుగ్గా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబరులో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని