Kishan Reddy: గత ప్రభుత్వాలు విమోచన వేడుకలు జరపలేదు: కిషన్‌రెడ్డి

 హైదరాబాద్‌ గడ్డపై తొలిసారిగా సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని.. 

Updated : 17 Sep 2022 12:03 IST

సికింద్రాబాద్‌: హైదరాబాద్‌ గడ్డపై తొలిసారిగా సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని.. మళ్లీ 75 ఏళ్ల తర్వాత సెప్టెంబర్‌ 17న ఇక్కడ త్రివర్ణ పతాకం ఎగురుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన వేడుకల్లో కిషన్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, కర్ణాటక రవాణాశాఖ మంత్రి శ్రీరాములు వేడుకలకు హాజరయ్యారు.

‘‘సెప్టెంబర్‌ 17.. నిజాం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడిన రోజు. స్వాతంత్ర్యం వచ్చాక త్రివర్ణపతాకం ఎగరవేస్తుంటే.. ఆనాడు నిజాం ప్రభువు అడ్డుకున్నారు. తెలంగాణ గడ్డపై జాతీయ జెండా ఎగురవేసేందుకు ఎందరో ప్రాణాలు అర్పించారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణలో గత ప్రభుత్వాలు విమోచన వేడుకలను జరపలేదు. మళ్లీ 75ఏళ్ల తర్వాత భాజపా ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న వేడుకలు నిర్వహిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా నిజాం పాలిత ప్రాంతాల్లో విముక్తి దినోత్సవాలు నిర్వహించాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది నామమాత్రంగా వేడుకలు నిర్వహిస్తోంది’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో నిర్వహించడం గొప్ప నిర్ణయం: కర్ణాటక మంత్రి శ్రీరాములు

‘‘నిజాం పాలనలో ప్రజలపై కర్కశంగా వ్యవహరించారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు. వారిని దారుణంగా హింసించారు. హైదరాబాద్ సంస్థానం పరిధిలో ఉన్న ప్రాంతాలపై రజాకార్ల అకృత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. కర్ణాటక, తెలంగాణ ప్రజలపై క్రూరంగా వ్యవహరించారు. ఆ సమయంలో సర్దార్‌ పటేల్ మిలిటరీ బలగాలతో నిజాం సైన్యంపై యుద్ధానికి దిగారు. సెప్టెంబర్ 13 నుంచి జరిగిన యుద్ధంలో నిజాం సైన్యం తలవంచింది. 17న విలీనానికి సిద్ధమైంది. కర్ణాటక, మహారాష్ట్రలో వేడుకలు నిర్వహిస్తున్నాం. కానీ తెలంగాణలో నిర్వహించడం గొప్ప నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయం’’ అని శ్రీరాములు అన్నారు.

నేడు సువర్ణ అధ్యాయం: మహారాష్ట్ర సీఎం ఎక్‌నాథ్‌ శిందే

‘‘మహారాష్ట్రలోనూ విమోచన వేడుకలు నిర్వహిస్తున్నాం. మరాఠ్వాడా ముక్తి దినోత్సవ్ పేరిట వేడుకలు జరుపుతున్నాం. వందలాది మంది నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులయ్యారు. భారతదేశ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం’’ అని మహారాష్ట్ర సీఎం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని