Telangana News: ప్రజలు సహకరిస్తే మూడో దశ నుంచి బయటపడతాం: హరీశ్‌రావు

కరోనా మహమ్మారి నుంచి త్వరలోనే బయట పడతామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated : 29 Jan 2022 15:15 IST

సత్తుపల్లి: కరోనా మహమ్మారి నుంచి త్వరలోనే బయట పడతామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గిందని చెప్పారు. ప్రజలు సహకరిస్తే మూడో దశ నుంచి బయటపడతామన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.34 కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘సత్తుపల్లిలో రూ.1.25కోట్లతో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌ తర్వాత ఖమ్మంలోనే క్యాథ్‌ల్యాబ్‌ పెట్టాం. కల్లూరు, పెనుబల్లి ఆస్పత్రులకు నూతన భవనాలు నిర్మిస్తాం. కేసీఆర్‌ కిట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 52శాతానికి పెరిగాయి. సంక్షేమానికి చిరునామా తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌’’ అని హరీశ్‌రావు చెప్పారు.  కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

భాజపా అబద్ధాల ప్రచారాన్ని నమ్మొద్దని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రమంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. భాజపా నేతలేమో గల్లీలో విమర్శలు చేస్తారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది భాజపానేనని వ్యాఖ్యానించారు. గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఐటీఐఆర్‌ రద్దు చేసి కోచ్‌ ఫ్యాక్టరీని ఎత్తుకుపోయారని విమర్శించారు. మేం ఇప్పటికే 1, 32, 899 ఉద్యోగాలిచ్చామని, మరో 50 వేలు లేదా 60 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. కేంద్రంలో ఖాళీగా ఉ న్న 15.62 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామన్న మోదీ ఎన్ని ఇచ్చారని హరీశ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ ఉద్యోగాలను పోగొట్టారని విమర్శించారు. బ్యాంకులు లూటీ అయి, ప్రభుత్వ రంగం కుదేలయ్యిందని చెప్పారు. ఐఏఎస్‌లను ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్తారా? అని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని