Telangana News: కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు: సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

Published : 27 May 2022 16:06 IST

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రూ.7,300 కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బషీర్‌బాగ్‌ అలియా పాఠశాలలో జరుగుతున్న పనులను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పరిశీలించారు.అనంతరం మంత్రి సబితా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చి దిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేస్తూ అన్ని సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలలకు కేవలం రంగులు వేయడమే కాకుండా బిల్డింగ్స్, వాటర్, టాయిలెట్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామన్నారు. 75 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని ఈ సందర్భంగా మంత్రి సబితా విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని