KTR: తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఇప్పుడే మొదలైంది: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ టీహబ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Published : 06 Jun 2023 21:36 IST

హైదరాబాద్‌: ‘‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. ఇది ట్రయల్‌ మాత్రమే. రాబోయే పదేళ్లలో అద్భుతమైన పురోగతి చూస్తారు’’ అని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ టీహబ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్లలో పారిశ్రామిక రంగం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ పారిశ్రామిక ప్రగతి నివేదికను మంత్రి విడుదల చేశారు.

తెలంగాణ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ ఆఫ్ వరల్డ్‌గా మారిందని, ఇప్పటికే 33శాతం ఉత్పత్తి చేస్తూ గొప్ప ఘనత సాధించిందన్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే సగానికిపైగా వ్యాక్సిన్లు హైదరాబాద్‌లో తయారవుతాయని తెలిపారు.  ప్రపంచం, దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్న ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్‌ భగీరథ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం పట్ల గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, పర్యావరణం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. వివిధ అంశాల వారీగా అనేక జాతీయ అవార్డులు, ప్రపంచ ప్రశంసలు అభిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు 2014లో ఉన్న పరిస్థితులను, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, పలు సంస్థల ఛైర్మన్లు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని