CM Kcr: 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు: సీఎం కేసీఆర్‌

21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

Updated : 13 May 2023 21:31 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సలహాదారులు, ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమైన సీఎం.. వేడుకల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి హృదయం ఉప్పొంగేలా, తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటే విధంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి, అదే రోజు మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. అమరవీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా మార్టియర్స్‌ డేగా  జరుపుకోవాలని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరుల స్తూపాలను పుష్పాలతో, విద్యుత్‌ దీపాలతో అలంకరించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించాలని చెప్పారు. 

స్వతంత్ర భారత దేశంలో తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం మొదలు, రాష్ట్రాన్ని సాధించే వరకు సాగిన తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలిపేలా డాక్యుమెంటరీని రూపొందించాలని సీఎం తెలిపారు. రాష్ట్రంగా ఏర్పడి ప్రభుత్వ పాలన ప్రారంభమైన 2014 జూన్‌ 2వ తేదీ నుంచి.. 2023 జూన్‌ 2 వరకు స్వయం పాలనలో సాగిన సుపరిపాలన, సాధించిన ప్రగతిపై మరో డాక్యుమెంటరీ రూపొందించాలని సూచించారు. 21 రోజుల పాటు తెలంగాణ సంబురాలు నిర్వహించాలన్న కేసీఆర్‌.. పిండి వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపదాలు, సంగీత విభావరి, సినిమా-జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీతం, నృత్యం, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని