Tandur Redgram: తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు

తాండూరు కందిపప్పునకు (Tandur Redgram) అరుదైన గుర్తింపు లభించింది. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పండించే ఈ కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు (GI tag) లభించినట్లు కేంద్రం వెల్లడించింది.

Updated : 14 Dec 2022 19:32 IST

దిల్లీ: తాండూరు కందిపప్పునకు (Tandur Redgram) అరుదైన గుర్తింపు లభించింది. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పండించే ఈ కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు (GI tag) లభించినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు అస్సాం గమోసా, లద్దాఖ్‌ యాప్రికాట్‌, మహారాష్ట్రకు చెందిన అలీబాగ్‌ వైట్‌ ఆనియన్‌కు సైతం జీఐ ట్యాగ్‌ లభించిందని వాణిజ్య పరిశ్రమల శాఖ బుధవారం తెలియజేసింది. వీటితో దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు పొందిన వాటి సంఖ్య 432కి చేరిందని పేర్కొంది.

జీఐ ట్యాగ్‌ సాధించిన రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. దేశంలో బాస్మతి రైస్‌కు, డార్జిలింగ్‌ టీ, చందేరి ఫ్యాబ్రిక్‌కు, మైసూర్‌ సిల్క్‌, కాంగ్రా టీ.. ఇలా చాలా వాటికి ఈ జీఐ ట్యాగ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి బనగానపల్లి మామిడి, బొబ్బిలి వీణ, ధర్మవరం చేనేత పట్టుచీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలు, ఉప్పాడ జామ్దానీ చీరలు, తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్‌, కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ, హైదరాబాద్‌ లాడ్‌ బజార్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

ఏమిటీ తాండూరు కంది పప్పు ప్రత్యేకత?

ఇతర ప్రాంతాల్లో పండించిన కందిపప్పు కంటే దాని రుచి తాండూరు కందిపప్పును ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది. ఈ పప్పు త్వరగా ఉడకడమేకాకుండా త్వరగా పాడవకుండా ఉంటుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో తాండూరు కందిపప్పు పేరుతో దీన్ని విక్రయిస్తారంటే దీని ప్రత్యేకత గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏటా తాండూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, యూపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు సైతం ఎగుమతి అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని