TS News: 25 నుంచి టీచర్స్‌ విధులకు రావాలి

జూన్‌ 25వ తేదీ నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Published : 22 Jun 2021 01:41 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని ఉపాధ్యాయులు ఎప్పటి నుంచి విధులకు హాజరుకావాలన్న దానిపై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జులై 1వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, విధి-విధానాలపై విద్యాశాఖ సమావేశమైంది. జూన్‌ 25వ తేదీ నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్‌ రెండో సంవత్సర ఫలితాలు వచ్చే వారంలో విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు.  డిప్లమో, డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ చివరి ఏడాది పరీక్షలు జులై 1 నుంచి 31 లోపు పూర్తి చేయాలన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు జులై 1 నుంచి ప్రారంభమవుతాయన్నారు. విద్యాశాఖలో 1000 గురుకులాలున్నాయని, వాటికి సంబంధించిన మంత్రులతో మాట్లాడి వాటిపైనా నిర్ణయం తీసుకుంటామని సబిత వివరించారు.

ఉపాధ్యాయులను రిస్క్ టేకర్స్ జాబితాలో చేర్చేందుకు సీఎస్‌కి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపామని మంత్రి తెలిపారు. అదే విధంగా, 18 ఏళ్లుపై బడిన విద్యార్థులకు సైతం వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. గతేడాది మాదిరిగానే ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి సబిత వివరించారు. ఈ ఏడాది 30 శాతం ఫీజులు తగ్గించేలా ప్రైవేట్ పాఠశాలకు విజ్ఞప్తి చేస్తామని, ఇందుకోసం ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అయితే, ఇంటర్‌పై బడిన అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధన, రెసిడెన్షియల్ పాఠశాల విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ విషయమై బుధవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్‌ తదితరులతో సబితా ఇంద్రారెడ్డి సమావేశమవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని