KRMB: కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్‌

కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్‌ చేసింది. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం కొనసాగింది..

Updated : 01 Sep 2021 21:28 IST

హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్‌ చేసింది. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం కొనసాగింది. సాగర్, కృష్ణా డెల్టా కింద సాగు, తాగు నీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేఆర్ఎంబీ చైర్మన్  ఎంపీ సింగ్‌ స్పష్టం చేశారు. జలవిద్యుత్‌ ఉత్పత్తిపై కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్‌ చేసి బయటకు వచ్చారు.

కృష్ణా జలవివాదలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం ఇవాళ కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ జలసౌధలో జరిగింది. బోర్డు ప్రతినిధులతో పాటు, రెండు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణకు జల విద్యుత్‌ ఉత్పత్తి చాలా అవసరమని అధికారులు సమావేశంలో వివరించారు. భౌగోళిక స్వరూపం దృష్ట్యా ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగునీరు ఇవ్వాల్సిఉందని, వ్యవసాయ బోరుబావులకు కూడా విద్యుత్‌ ఉత్పత్తి కావాలని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్‌  ఉత్పత్తి కోసమే నిర్మించిన ప్రాజెక్టు అన్న తెలంగాణ అధికారులు ... జలవిద్యుత్‌ ఉత్పత్తి అత్యవసరమని స్పష్టం చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అభ్యంతరం తెలిపారు. దిగువన సాగునీటి అవసరాలు లేనప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే తమకు నష్టం జరుగుతుందని వివరించారు. నాగార్జున సాగర్‌, కృష్ణాడెల్టాలో సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే జలవిద్యుత్‌ ఉత్పత్తి చేయాలని కేఈఆర్‌ఎంబీ ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ స్పష్టం చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ అధికారులు కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. తెలంగాణ వాకౌట్‌ అనంతరం కృష్ణాబోర్డు సమావేశం ముగిసింది. ఆ తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమావేశం ప్రారంభమైంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ఛైర్మన్లు ఎంపీ సింగ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో జరుగుతున్న ఉమ్మడి భేటీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ అధికారులు పాల్గొన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై బేటీలో చర్చిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని