Telangana Rains: భారీ వర్షాలు.. నిండు కుండల్లా ప్రాజెక్టులు

ఎగువ నుంచి వస్తున్న వరదలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌(ఎస్సారెస్పీ) నుంచి 

Updated : 11 Jul 2022 12:29 IST

ఎస్సారెస్పీ నుంచి భద్రాచలం వరకు వరద ఉద్ధృతి

హైదరాబాద్: ఎగువ నుంచి వస్తున్న వరదలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌(ఎస్సారెస్పీ) నుంచి  భద్రాచలం వరకు ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. ఉపనదుల సంగమంతో కాళేశ్వరం, భద్రాచలం మధ్య వరద నీరు ఉరకలెత్తుతోంది. ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారిపోయాయి. శ్రీరాంసాగర్‌కు వరద పోటెత్తుతోంది.  ప్రాజెక్టులో 99,850 క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తుండగా.. 9 గేట్ల ద్వారా 41వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087.8 అడుగులు ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం  75.785 టీఎంసీలుగా ఉంది.

53 అడుగులకు పెరిగితే..

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గోదావరిలో నీటిమట్టం ఉదయం 9: 00 గంటలకు 49.90 అడుగులకు చేరింది. భద్రాచలంలో స్నాన ఘట్టాల ప్రాంతం నీట మునిగింది.  గోదావరి దిగువున ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. నీటి మట్టం 53 అడుగులకు పెరిగితే చివరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. 

హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లు నిండు కుండలా మారుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి నీటి  మట్టం  1760.55 అడుగులకు చేరింది. అధికారులు రెండు క్రస్ట్‌ గేట్లను అడుగు మేర ఎత్తి వరదను దిగువకు వదిలారు. గండిపేట జలాశయానికి సంబంధించి మూసీ వాగులో మోస్తరు వరద ప్రవాహం పారుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మధ్య, చిన్న తరహా నీటి వనరులు నిండు కుండల్లా మారాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని